30 ఏళ్ల క్రితం భార్య ఆత్మహత్య.. భర్తకు శిక్షపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ట్రయిల్ కోర్టు, హైకోర్టులు అతడికి శిక్ష విధించగా సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది.
ఒక వ్యక్తి భార్య ఆత్మహత్యకు సంబంధించి భర్తకు శిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రయిల్ కోర్టు, హైకోర్టులు అతడికి శిక్ష విధించగా సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది.
30 ఏళ్ల క్రితం అతడి భార్య ఆత్మహత్య చేసుకుందని.. అతడి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని అనడానికి ఆధారాలేవని పేర్కొంది. 30 ఏళ్ల నుంచి అతడు ఈ బాధను అనుభవిస్తూనే ఉన్నాడని గుర్తు చేసింది.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం భర్త ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే ఆమె మరణించిందని చెప్పడానికి పోలీసుల ఆరోపణలు సరిపోవని స్పష్టం చేశారు. భర్తను ఈ కేసులో నేరస్తుడిగా తేల్చడానికి అతడు భార్యను వేధించాడని ఆరోపణలు చేస్తే సరిపోదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
నేరం చేసినవారు శిక్ష పడకుండా తప్పించుకోకూడదని.. అయితే చట్టపరమైన సాక్ష్యాల ఆధారంగానే వాటిని నిరూపించి శిక్షలు విధించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన ప్రత్యక్ష, పరోక్ష కారణాలను తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. వివాహిత ఆత్మహత్యకు కేవలం వేధింపులే కారణమని ఊహించుకోవడం సరికాదన్నారు.
ఈ కేసులో భర్త తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు 1993 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాడని గుర్తు చేశారు. ఇప్పటికి కానీ ఆ కేసు పూర్తి కాలేదన్నారు. అంటే 30 ఏళ్ల నుంచి ఈ బాధను అతడు అనుభవిస్తున్నాడని న్యాయమూర్తులు గుర్తు చేశారు. భార్య తన ఆరునెలల చిన్నారిని వదిలి ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు కోణాల్లోనూ లోతుగా ఆలోచించి భర్తను నిర్దోషిగా ప్రకటించామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
కాగా ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. హరియాణాకు చెందిన నరేష్ కుమార్ భార్య 1993లో ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమెను భర్త నరేష్ తోపాటు అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. నరేష్ పై ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద కేసు పెట్టారు.
ఈ కేసు ట్రయల్ కోర్టులో విచారణకు రాగా 1996లో నరేశ్ ను కోర్టు నేరస్తుడిగా నిర్ధారించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పుపై నరేష్ పంజాబ్, హరియాణాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా నరేష్ కు నిరాశే ఎదురైంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2008లో నరేష్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును, శిక్షను రద్దు చేస్తూ.. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇందుకోసం అతడికి 30 ఏళ్ల సమయం పట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది.