భర్తకు కూడా భరణం వస్తుందండోయ్!
సాధారణంగా భార్యాభర్తలు విడిపోతే భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే
సాధారణంగా భార్యాభర్తలు విడిపోతే భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కేవలం విడిపోతే భార్య మాత్రమే కాదు.. ప్రత్యేక పరిస్థితుల్లో భర్త కూడా భరణం పొందే హక్కు ఉందని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనారోగ్యంతో ఇంటిలోనే ఉంటున్న మాజీ భర్తకు నెలకు భరణం కింద రూ.10 వేలు చొప్పున చెల్లించాలంటూ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. హిందూ ధర్మంలో భార్యాభర్తల సంబంధాన్ని అర్థ నారీశ్వరతత్వంగా చెబుతారని, ఒకరు ఎక్కువ, తక్కువ కాదని, ఇద్దరూ సమానమేననేది దీని అర్థమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కష్టసుఖాల్లో, మంచిచెడుల్లో ఒకరికొకరు భార్యభర్తలు తోడుగా నిలవాలని హిందూ వివాహ చట్టం చెబుతోందని బాంబే హైకోర్టు తెలిపింది.
ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలకు రూ.10 వేల చొప్పున భార్య భరణం చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్ తో కూడిన సింగిల్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది.
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన భార్యాభర్తల్లో భార్య బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తోంది. భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడు ఉద్యోగానికి వెళ్లలేక ఇంటికే పరిమితమయ్యాడు.
దీంతో భర్త.. తనకు భార్య భరణం చెల్లించడంతోపాటు విడాకులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన సివిల్ కోర్టు 2020 మార్చిలో అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు చేయడంతోపాటు భార్య అతడికి రూ.10 వేలు ప్రతి నెలా భరణం కింద ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
తన భర్తకు అనుకూలంగా సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును భార్య బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. తాను ఇప్పటికే ఇంటి లోన్ ప్రతి నెలా చెల్లిస్తున్నానని, అలాగే ఇద్దరు పిల్లల పోషణాభారం కూడా తనపైనే ఉందని, ఇప్పుడు కొత్తగా తన భర్తకు భరణం చెల్లించలేనని వివరించింది.
అంతేకాకుండా తాను 2019లోనే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశానని భార్య కోర్టుకు నివేదించింది. తనకు ఎలాంటి ఆదాయం లేదని.. అందువల్ల తన మాజీ భర్తకు భరణం ఇవ్వలేనంది. అయితే ఉద్యోగం, ఇతర ఆదాయ మార్గాలు లేకుండా ఇద్దరు పిల్లలను ఎలా పోషించుకుంటున్నారని కోర్టు ఆమెను ప్రశ్నించింది. ఉద్యోగం లేదనడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదని నిలదీసింది.
భార్య వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. భర్త అనారోగ్యానికి గురయ్యాడని.. అతడు ఉద్యోగం చేయగల స్థితిలో లేడని.. ఈ నేపథ్యంలో జీవనోపాధి లేక అతడు జీవించడం కష్టంగా మారుతుంది కాబట్టి అతడికి ప్రతి నెలా భరణం కింద రూ.10 వేలు చెల్లించాల్సిందేనంటూ విస్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.