అమెరికాలో ఏం జరుగుతోంది.. మరో భారతీయుడు మృతి!
తాజాగా అమెరికాలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో భారత్ కు చెందిన ఓ జర్నలిస్టు మరణించాడు.
ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయులు వరుసగా మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. వీరిలో విద్యార్థులు, అమెరికాలో నివసిస్తున్న భారత ఉద్యోగులు, భారత సంతతి వ్యక్తులు ఉంటున్నారు. వీరిలో కొందరు ప్రమాదాలతో, మరికొందరు హత్యకు గురికావడంతో, మరికొందరు అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా అమెరికాలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో భారత్ కు చెందిన ఓ జర్నలిస్టు మరణించాడు. ఈ ఘటన అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ లో చోటు చేసుకొంది.
మీడియా కథనాల ప్రకారం.. భారత్ కు చెందిన ఫాజిల్ ఖాన్ (27) మన దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో కాపీ ఎడిటర్ గా పనిచేశాడు. ఆ తర్వాత జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు 2020లో న్యూయార్క్ వెళ్లాడు. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్ లో కోర్సును పూర్తి చేశాడు. అప్పటి నుంచి అతడు అమెరికాలోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24న ఫాజిల్ ఖాన్ ఉంటున్న అపార్టుమెంటులో ఉన్న ఓ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనంలోని లిథియం అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో చిక్కుకున్న జర్నలిస్టు ఫాజిల్ ఖాన్ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనలో కొందరు కిటికీలో నుంచి దూకడంతో ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 17 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ ప్రమాదంపై అమెరికాలోని భారత కార్యాలయం స్పందించింది. ఫాజిల్ ఖాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది. మృతుడి కుటుంబం, స్నేహితులతో టచ్‌లో ఉన్నామని వెల్లడించింది. మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటరే మంటలకు కారణమని అధికారులు తెలిపారు. మంటల్లో గాయాలపాలైన ఫాజిల్æఖాన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు.
మంటలు తొలుత పై అంతస్తుల్లో ప్రారంభమయ్యాయని, దీంతో పై అంతస్తుల్లో ఉన్నవారు కిటికీల్లో నుంచి కిందకు దూకారని అఖిల్ జోన్స్ అనే స్థానికుడు వివరించాడు. తాను, తన తండ్రి ప్రమాదం నుంచి తప్పించుకున్నామన్నాడు. ఫోన్, తాళాలు తప్ప తాము తమ వెంట ఏమీ తెచ్చుకోలేదని తెలిపాడు.