యూఎస్ లో భారత అధికారి అనుమానాస్పద మృతి... ఎంబసీ రియాక్షన్ ఇదే!
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ)లో విషాదం చోటు చేసుకుంది.
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ)లో విషాదం చోటు చేసుకుంది. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో 18 సెప్టెంబర్ 2024 సాయంత్రం ఓ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని 20 సెప్టెంబర్ 2024న ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది.
అవును అమెరికాలోని వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. పీటీఐ వార్తా సంస్థ ప్రకారం... స్థానిక పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ప్రస్తుతం ఈ సంఘటనపై ఆత్మహత్యకు గల అవకాశాలతో సహా దర్యాప్తు చేస్తున్నాయని అంటున్నారు.
ఈ విషయాలపై స్పందించిన భారత రాయబార కార్యలయం... తమ ప్రాంగణంలో ఈ నెల 18 బుధవారం సాయంత్రం ఓ అధికారి మరణించినట్లు దృవీకరిస్తున్నామని తెలిపింది. ఇదే సమయంలో... త్వరలో మృతదేహాన్ని భారత్ కు పంపించడానికి సంబంధిత ఏజెన్సీలు, కుటుంబ సభ్యులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో... ప్రధానంగా కుటుంబం గోప్యత కోసం మరణించిన అధికారికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడించడం లేదని ఎంబసీ పేర్కొంది. ఈ విషాద సమయంలో మరణించిన ఆ అధికారి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొంది.
మరోవైపు ఈ ఘటనపై స్థానిక పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా.. లేక, ఎవరైనా ఆయనను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారని అంటున్నారు.