ఇదేంది నాయనా..? ఇంత కఠినమా? కూతురు అధ్యక్షురాలవుతున్నా మాట లేదు

అంతేకాదు.. ఇదేదో మహిళల పట్ల వివక్ష ఎక్కువగా ఉండే దేశంలో జరగడం లేదు. అందరూ జీవించాలనే కలలు గనే దేశంలో జరుగుతోంది.

Update: 2024-08-30 09:30 GMT

పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగితే సంతోషించని తల్లిదండ్రులు ఎవరు? వారి ఎదుగుదలను కోరుకోని వారు ఎవరు? ఇక దేశ అధ్యక్షులో..? ఉపాధ్యక్షులో అయితే గొప్పగా గర్వించని వారు ఎవరుంటారు? కానీ, ఆయన గుండె మాత్రం కఠినం... కుమార్తె దేశానికి అధ్యక్షురాలయ్యే గొప్ప అవకాశం ఉన్నా మద్దతు ఇవ్వడం లేదు. ఉపాధ్యక్షురాలు అయినప్పటికీ కనీస పలకరింపు లేదు.. ఎవరైనా చూస్తే.. ఇదేం తండ్రి నాయనా? అనుకునే పరిస్థితి. అంతేకాదు.. ఇదేదో మహిళల పట్ల వివక్ష ఎక్కువగా ఉండే దేశంలో జరగడం లేదు. అందరూ జీవించాలనే కలలు గనే దేశంలో జరుగుతోంది.

ఆమె శ్యామల..

తల్లిదండ్రులను గౌరవించడం భారతీయుల సంప్రదాయం. దీనిని పుణికిపుచ్చకున్నారు ప్రవాస భారతీయురాలు కమలా హారిస్. కుటుంబ సంబంధాలకు అంతగా విలువ ఉండని అమెరికాలో ఆమె ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగినా తల్లిదండ్రుల గురించి తరచూ సమావేశాల్లో చెబుతుంటారు. భయం లేకుండా ముందుకు సాగమని తండ్రి తనకు నూరిపోశారని కొన్ని రోజుల కిందట షికాగోలో జరిగిన డీఎన్‌సీ ప్రసంగంలో చెప్పారు. కానీ, ఆ తండ్రి మాత్రం కూతురు అంటే పెద్దగా ప్రేమ ఉన్న వ్యక్తిలా లేడు. ఇదంతా కమలా తండ్రి డొనాల్డ్‌ జె.హారిస్‌ గురించి.

86 ఏళ్ల వయసులోనూ పట్టుదల

డొనాల్డ్ జె.హారిస్.. ప్రస్తుత వయసు 86. ఆయన 1938లో జమైకాలోని బ్రౌన్స్‌ టౌన్‌ లో పుట్టాడు. ప్రముఖ గాయకుడు బాబ్‌ మార్లే స్వస్థలం కూడా ఇదే. డొనాల్డ్‌ లండన్‌ లో చదివి వచ్చి.. కాలిఫోర్నియాలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రవాస భారతీయురాలైన శ్యామల గోపాలన్ ను 1962లో బెర్క్‌ లీలో కలిశారు. శ్యామల క్యాన్సర్‌ పై పరిశోధకురాలు. కాగా, వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా.. పెద్దవారు కమలా, రెండో కుమార్తె మాయా. కాగా, కమలాకు ఏడేళ్ల వయసు ఉండగా శ్యామల, హారిస్‌ విడిపోయారు. కమలా తల్లి వద్దే కెనడా, ఇల్లినాయిస్‌ లలో పెరిగారు. కాలిఫోర్నియాకు వలస వెళ్లారు. ఇక అప్పటినుంచి ఇరువురి మధ్య పెద్దగా సంబంధాలు లేవు.

గొప్ప ప్రొఫెసర్ అయినా..

డొనాల్డ్ ఉన్నత విద్యావంతుడు. 1972లోనే ప్రఖ్యాత స్టాన్‌ ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌ ఆయన. వామపక్ష ఆర్థికవేత్తగా ఈయనను చెబుతుంటారు. విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయంలోనూ పని చేశారు. 1998లో రిటైరైన డొనాల్డ్.. విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఈయన మాజీ భార్య శ్యామల 15 ఏళ్ల కిందటే మరణించారు. కానీ.. డొనాల్డ్ మాత్రం పిల్లల వద్దకు వెళ్లాలనుకోలేదు. కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలు అయినప్పటికీ ఆయన ఆమె ప్రస్తావనను తీసుకురారు. కాగా, డొనాల్డ్ ఉండేది ఎక్కడో కాదు.. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోని ఐసన్‌ హోవోర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌ కు కిలోమీటరున్నర దూరంలోనే. అయినా కూతురు కమలాను కలవాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. అంతెందుకు.. ఉపాధ్యక్షురాలిగా 2020లో కమలా ప్రమాణం చేసినప్పుడూ రాలేదు. అసలు తండ్రీకూతురు మధ్య మాటలే లేవంటారు.

ట్రంప్ మాత్ర వదలట్లే..

కమలా హారిస్ ప్రత్యర్థి.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గట్టిగా విమర్శలు చేస్తుంటారు. చివరకు కమలాను వ్యక్తిగతంగానూ దూషిస్తుంటారు. ఈ క్రమంలో వామపక్ష భావజాలం ఉన్న తండ్రి నుంచే కమలాకు వామపక్షం వంటబట్టిందని ఆరోపిస్తుంటారు.

Tags:    

Similar News