సునాక్ వర్సెస్ జగన్.. ఎంత హుందా!
కిందపడ్డా పైచేయి మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నాయకులు కనిపిస్తున్న సమయంలో అనూహ్యంగా బ్రిటన్ లో చోటు చేసుకున్న పరిణామం.. ఇలాంటి నాయకులకు చెంప పెట్టుగా మారింది.
రాజకీయాల్లో ఎవరికైనా గెలుపు-ఓటములు సహజం. అయితే.. గెలిచినప్పుడు తనంతవాడు లేడనే విధంగా.. ఓడినప్పుడు.. ప్రజలు తప్పు చేశారనో..ఈవీఎంలు తప్పు చేశాయనో.. లేక ప్రజలు ప్రత్యర్థి పార్టీలు గుప్పించిన పథకాలకు ప్రలోభాలకు గుర య్యారనో.. వాదించేవారు ఉన్నారు. కానీ, ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరోధార్యమని చెప్పే అలవాటును కొందరు మానుకున్నారు. కిందపడ్డా పైచేయి మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నాయకులు కనిపిస్తున్న సమయంలో అనూహ్యంగా బ్రిటన్ లో చోటు చేసుకున్న పరిణామం.. ఇలాంటి నాయకులకు చెంప పెట్టుగా మారింది.
బ్రిటన్‌లో ప్రజాతీర్పు అందరికీ తెలిసిందే. అధికార రుషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్‌ను ఘోరంగా ఓడించారు. ఈ పార్టీకి చెందిన కొంద రు ఎంపీలైతే.. అసలు డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఈ పరిణామాన్ని సునాక్ అస్సలు ఊహించలేదు. పైగా.. హిందూత్వ వాదాన్ని కూడా.. తన మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా భారతీయ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అందరినీ కలుపుకొని పోయారు. అయినప్పటికీ.. బ్రిటన్ ప్రజలు మార్పును కోరుకున్నారు. అది కూడా అలాంటి ఇలాంటి మార్పు కాదు.. అధికార పార్టీని చిత్తుచిత్తుగా ఓడించేశారు. దీనిని ఊహించని సునాక్.. తీవ్ర భావొద్వేగానికి గురయ్యారు.
అయినప్పటికీ.. చాలా హుందాగా వ్యవహరించారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా ఉన్నా.. శిరోధార్యమని పేర్కొన్నారు. తాజా తీర్పును తాను అస్సలు ఊహించలేదని.. అయినా మనస్పూ ర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. ప్రజాతీర్పులో విజయం దక్కించుకున్న లేబర్ పార్టీని అభినందించారు. ప్రజల ఆగ్రహాన్ని అర్ధం చేసుకున్నానని సునాక్ సగౌరవంగా ప్రకటించారు. అంతేకాదు.. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ.. పార్టీ అధినాయకత్వ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు తెలిపారు.
కట్ చేస్తే.. ఏపీలో జగన్ పార్టీ వైసీపీ ఓడిపోయింది. 2019లో భారీ సంఖ్యలో సీట్లు ఇచ్చి అందలం ఎక్కించిన వారే.. 2024కు వచ్చేసరికి విసిరి కొట్టారు. 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. కానీ.. సునాక్‌కు ఉన్న హుందా తనం.. రాజకీయ పరిణితి.. జగన్ ప్రదర్శించలేకపోయారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజలను ప్రతిపక్షాలు ప్రలోభాలకు గురిచేశాయన్నారు. అంతేకాదు.. తాము అసలు ఓడిపోలేదని కూడా చెప్పారు. అంతేకాదు.. తాము మంచి చేసి ఓడిపోయామన్నారు. అంతేకానీ.. ప్రజల తీర్పును తాము గౌరవిస్తున్నామని.. తప్పులు సరిచేసుకునే ప్రయత్నం చేస్తామని కానీ.. జగన్ నోటి నుంచి రాకపోవడం గమనార్హం. ఒకవైపు అగ్రరాజ్యం బ్రిటన్ యువ పాలకుడిగా పేరున్న సునాక్‌కు.. మరోవైపు ఏపీని నిండాముంచారన్న అపప్రదను మూటగట్టుకున్న జగన్‌కు ఎంత తేడా అనే చర్చ నెటిజన్ల మధ్య సాగుతోంది.