కెనడాలో భారతీయ విద్యార్థిపై మరో దారుణం!
ఉత్తర అమెరికా ఖండ దేశమైన కెనడా ఇటీవల కాలంలో భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిన విషయం తెలిసిందే.
ఉత్తర అమెరికా ఖండ దేశమైన కెనడా ఇటీవల కాలంలో భారత వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత రెండు దేశాల సంబంధాలు దిగజారాయి. హర్దీప్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
ఇటీవల భారత్ పై తరచూ విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న కెనడాలో మరో దారుణం చోటు చేసుకుంది. కెనడాలోని సౌత్ వాంకోవర్ లో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 12 అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్ ఆంటిల్ ను అతడి కారులోనే దుండగులు కాల్చిచంపడం తీవ్ర కలకలం రేపింది.
వాంకోవర్ లోని ఈస్ట్ 55వ అవెన్యూ మెయిన్ స్ట్రీట్ కూడలిలో చిరాగ్ ఆంటిల్ మృతదేహం లభ్యమైంది. మనదేశంలోని హర్యానా రాష్ట్రంలో సోనిపట్ కు చెందిన చిరాగ్ అంటిల్ ఉన్నత విద్య కోసం 2022లో కెనడాకు వెళ్లాడు. అతడి తండ్రి మహావీర్ హర్యానా ప్రభుత్వంలోని షుగర్ మిల్లు విభాగంలో అధికారిగా పనిచేస్తున్నారు.
2022లో కెనడాకు వెళ్లిన చిరాగ్ అంటిల్.. బ్రిటిష్ కొలంబియాలోని యూనివర్సిటీ ఆఫ్ కెనడా వెస్ట్ (యూసీడబ్ల్యూ)లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వాంకోవర్ కు తన నివాసం మార్చాడు. చదువు పూర్తయ్యాక కెనడాలో వర్క్ పర్మిట్ లభించడంతో అతడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా చిరాగ్ అంటిల్ హత్యకు కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. హత్య కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
మరోవైపు చిరాగ్ దారుణ హత్యకు గురికావడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లుతున్నారు. అతడి మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఆ కుటుంబం ఉంది. దీంతో కెనడాలో చిరాగ్ అంటిల్ కుటుంబ సభ్యులు విరాళాల సేకరణ చేపట్టారు.
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు చిరాగ్ కు న్యాయం జరిగేలా చూడాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా కెనడా నుంచి అతడి మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి సహాయమందించాలని అభ్యర్థించారు.