అమెరికాలో ఏపీ విద్యార్థి మృతి... నాలుగు నెలల్లో మూడో వ్యక్తి!
ఈ క్రమంలో రకరకాల కారణాలతో వారు మృత్యువాత పడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఉన్నత చదువుల కోసమని కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి విదేశాలకు వెళ్తున్నారు కొంతమంది యువత! ఈ క్రమంలో బంగారు భవిష్యత్తు కోసం, కన్నవారి కలలు నెరవేర్చడం కోసం లక్షల మైళ్ల అవతల చదువుకుంటున్నారు. ఈ క్రమంలో రకరకాల కారణాలతో వారు మృత్యువాత పడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో కొంతమంది, గన్ కల్చర్ ప్రభావానికి ఇంకొంతమంది, స్నేహితులతో విహార యాత్రలకు వెళ్లి మరికొంతమంది మృత్యువాత పడుతున్నారు. కన్నవారికి తీరని శోకాన్నీ మిగులుస్తున్నారు! ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ విద్యార్థి తాజాగా అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు.
అవును... అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విద్యార్థి ముత్తిన రమేష్ గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఎమ్మెస్ చదువుతున్న రమేష్... నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు.
రమేష్ మృతి విషయం తెలుసుకున్న తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు! ఎమ్మెస్ పట్టా తీసుకుని వస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా రానుండటంతో వారి ఆవేదనను ఆపడం సాధ్యం కావడం లేదు!
ఈ సందర్భంగా... తమ కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నారు. కాగా... గడిచిన నాలుగు నెలలోనే ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎమ్మెస్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది!