బ్రిటన్‌ లో జాగ్త్రత.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక!

బ్రిటన్‌ లో వలసలకు వ్యతిరేకంగా ఆ దేశస్తులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది

Update: 2024-08-06 13:30 GMT

బ్రిటన్‌ లో వలసలకు వ్యతిరేకంగా ఆ దేశస్తులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. బ్రిటన్‌ లో భారతీయులు జాగ్త్రతగా ఉండాలని ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. లండన్‌ లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని పేర్కొంది.

కాగా ఇంగ్లాండ్‌ లో కొద్దిరోజుల క్రితం ఓ డ్యాన్స్‌ క్లాస్‌ పై దుండగులు విరుచుకుపడ్డారు. కత్తులతో ముష్కరులు దాడి చేయడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఇంగ్లండ్‌ లో అల్లర్లకు దారితీసింది.

వలస వచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చిన్నారుల మరణాలకు కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇంగ్లండ్‌ లోని మాంచెస్టర్, నాటింగ్‌ హామ్, బెల్‌ ఫాస్ట్, స్టోక్‌ ఆన్‌ ట్రెంట్, బ్లాక్‌పూల్, లీడ్స్, బ్రిస్టల్, హల్, లివర్‌ పూర్‌ వంటి ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు.

పోలీసులపైకి రాళ్లు విసరడం, కొవ్వొత్తులు వెలిగించి విసరడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్‌ పైనా దాడి చేశారు.

కాగా నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌ కొత్త ప్రధాని కీర్‌ స్మార్టర్‌ అధికారులను ఆదేశించారు. వలసవచ్చినవారు ఉంటున్న హోటల్‌ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో భారత్‌.. బ్రిటన్‌ లో ఉన్న భారత పౌరులను అప్రమత్తం చేసింది. జాగ్రత్తలతో కూడిన ట్రావెల్‌ అడ్వైజరీ ను జారీ చేసింది.

ఇంగ్లండ్‌ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్ల గురించి భారతీయులు తెలిసే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

లండన్‌ లో ఉన్న భారత రాయబార కార్యాలయం పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంగ్లండ్‌ వెళ్లిన భారతీయులు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తతతో వ్యవహరించాలని కేంద్రం తెలిపింది.

అల్లర్ల నేపథ్యంలో ఇంగ్లండ్‌ లోని స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలను భారతీయులు అనుసరించాలని కేంద్రం కోరింది.. నిరసనలు జరుగుతున్న ప్రాంతాల వైపు వెళ్లకపోవడమే మంచిదని వెల్లడించింది.

Tags:    

Similar News