బిగ్ బ్రేకింగ్ : ఒకేసారి ప్రకాశంలో 10 మంది వాలంటీర్ల రాజీనామా !

Update: 2020-04-03 06:30 GMT
ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో 10 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లు లిఖిత పూర్వకంగా, పంచాయితీ కార్యదర్శి మాధురిలత కు గురువారం అందజేశారు. 10 మంది ఒకేసారి రాజీనామా చేయడం తో కలకలం రేగింది. అలాగే ప్రభుత్వం తరపున అందజేసిన మొబైల్స్ తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ .. అర్హులకు పెన్షన్‌ మంజూరు చేయకుండా అనర్హులందరికి పెన్షన్‌ ఇచ్చారని దీనితోనే  తాము రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు చెప్పారు.

అయితే , రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన  తరువాత, సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ..ప్రతిష్టాత్మకంగా తీసుకోని ఈ వాలంటీర్ల వ్యవస్థని తీసుకువచ్చారు. దీనితో ప్రతి గ్రామంలో ..ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి ..ప్రభుత్వ  పథకాలన్నీ వారికీ అందేలా చూస్తున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా కొందరు వలంటీర్ల పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వారిని తొలగించి , వారి స్థానాలలో ఇతరులని తీసుకున్నారు. కానీ, ఇలా ఒకేసారి పదిమంది వాలంటీర్లు రాజీనామా చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీనిపై సంబంధిత అధికారులతో మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సమావేశం నిర్వహించి, రాజీనామా చేయడానికి గల కారణాలను ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వైసీపీ నేతలతో ..వాలంటీర్లతో కూడా చర్చలు జరిపారు.

ఇకపోతే ప్రస్తుతం కరోనా రాష్ట్రంలో కోరలు చాచుతున్న నేపథ్యంలో వాలంటీర్లే సైనికులై ... కరోనా పై పోరాటం చేస్తున్నారు. ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి , అందరి ఆరోగ్యం పై వివరాలు సేకరిస్తూ , ఆ వివరాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. దీనితో వాలంటీర్ వ్యవస్థ పై పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఒకేసారి 10 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
Tags:    

Similar News