వంద కోట్ల ఆస్తి వ‌ద్ద‌ని ఆ జంట ఏం చేశారంటే?

Update: 2017-09-16 05:15 GMT
నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ అదే ప‌నిగా సంప‌ద‌ను సృష్టించ‌టం ఇప్పుడో వ్యాప‌కంగా మారిపోయింది. డ‌బ్బుకు మాత్ర‌మే విలువ‌నిస్తూ.. మ‌రేమి ప‌ట్టించుకోని వారం సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఎంత సంపాదించినా అసంతృప్తితో.. ఇంకా.. ఇంకా అంటూ సంపాద‌న కోసం ప‌రుగులు పెట్టే వారు నిత్యం మ‌న చుట్టూ భారీగానే క‌నిపిస్తారు. ఇందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన ఒక జంట తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. రాత్రికి రాత్రి వారి నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ కు చెందిన సుమిత్‌.. అనామికా దంప‌తులు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కూ ఈ దంప‌తులు తీసుకున్న నిర్ణ‌యం ఏమిటో తెలుసా?

వ్యాపార కుటుంబానికి చెందిన సుమిత్‌.. అనామికా దంప‌తుల ఆస్తిని ఒక్క మాట‌లో చెప్పాలంటే రూ.100 కోట్ల‌కు పైనే ఉంటుంది. ఇక‌.. వారెంత సంప‌న్నులో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వారికి మూడేళ్ల గారాల‌ప‌ట్టి ఉన్నారు. మ‌రింత హైప్రొఫైల్ ఉన్న వారు.. క‌ల‌లో కూడా ఊహించ‌నిరీతిలో స‌న్యాసం తీసుకోవాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఇప్పుడు వారి నిర్ణ‌యం విన్న వారంద‌రిని షాకింగ్‌ కు గురి చేస్తోంది.అధ్యాత్మిక చింత‌న‌లో త‌మ జీవితాన్ని గ‌డిపేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా న‌ల‌భై ఏళ్ల లోపున్న ఈ దంప‌తులు ఇద్ద‌రు గట్టిగా నిర్ణ‌యించుకున్నారు. అంతేకాదు.. త‌మ మూడేళ్ల గారాల‌ప‌ట్టిని వారి బంధువుల‌కు అప్ప‌గించారు. ఆమె బాగోగులు ఇక‌పై వారే చూసుకోవాల‌ని కోరారు.

ఈ నెల 23న సూర‌త్ లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ దంప‌తులు ఇద్ద‌రూ జైన్ స‌న్యాసులుగా మారిపోనున్నారు. భారీ సంప‌ద‌ను.. సంసారాన్ని.. సుఖాల్ని వ‌దిలేసి అధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో త‌రించాల‌ని భావిస్తున్న వీరి తీరు ఇప్పుడు అన్ని వ‌ర్గాల్లోనూ సంచ‌ల‌నంగా మారింది. వీరు తీసుకున్న నిర్ణ‌యం చాలా క‌ఠిన‌మైన‌ద‌ని.. అందుకు వారిద్ద‌రూ ఇష్టంగానే తీసుకున్నార‌ని బంధువులు చెబుతున్నారు.

ముందు నుంచి ఈ దంప‌తుల‌కు దైవ‌రాధ‌న మీద ఆస‌క్తి ఉంద‌ని.. పెళ్లి చేసుకొని మూడేళ్ల పాప ఉన్న త‌ర్వాత కూడా ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకోవ‌టం చాలా సాహ‌సంతో కూడుకున్న‌ద‌ని.. ఇది చాలా క‌ఠిన‌మైన నిర్ణ‌యంగా దంప‌తుల బంధువు అభివ‌ర్ణిస్తున్నారు.ఇదో క‌ఠోర త‌ప‌స్సు అని.. దీంతో మ‌మ‌త‌ను మోహాన్ని అధిగ‌మించాల‌న్న త‌ప‌న‌తోనే ఈ దంప‌తులు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని చెబుతున్నారు. వీరి నిర్ణ‌యం తెలిసిన బంధువులు.. స్థానికులు వ‌ద్దంటే వ‌ద్ద‌ని చెబుతున్నా.. అంద‌రి అభిప్రాయాల్ని సున్నితంగా తిర‌స్క‌రిస్తూ.. తాము జైన స‌న్యాసులుగా మారిపోవాల‌న్న నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News