పట్టుబిగిస్తున్న పోలీసులు.. వంశీ ఇరుక్కున్నట్లేనా?
హైదరాబాద్ లో వంశీ అరెస్టు తర్వాత ఆయన మొబైల్ ఫోన్ కనిపించడం లేదు. ఆ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీకి వ్యతిరేకంగా కీలక ఆధారాలు సేకరించేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ వంశీ నివాసంలో తెలంగాణ పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ సేకరించిన పోలీసులు.. వంశీ మొబైల్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ లో వంశీ అరెస్టు తర్వాత ఆయన మొబైల్ ఫోన్ కనిపించడం లేదు. ఆ ఫోన్ లో కీలక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు వంశీని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ అండ్ గ్యాంగ్ పై ఆరోపణలు, వచ్చిన ఫిర్యాదులు ఇలా చాలా అంశాలపై ఆయన నుంచి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలను సంపాదించాలని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. ఇక ప్రస్తుత టెక్నాలజీ సమయంలో ఐటీ సర్వేలైన్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వంశీ ఇంటిలో ససీ కెమెరా పుటేజీ కీలకమని చెబుతున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను వంశీ తన ఇంట్లోనే కలిసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అనుచరుల ద్వారా సత్యవర్థన్ ను పిలిపించి, ఆ తర్వాత అతడిని విశాఖకు తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజ్, వంశీ మొబైల్ పరిశీలిస్తే మొత్తం వ్యవహారం ఎలా నడిచిందో తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. ఇందుకోసమే విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఓ ఇన్ స్పెక్టర్, ఎస్ఐ, మరికొందరు కానిస్టేబుల్స్ వంశీ ఇంటికి చేరుకున్నారు. వంశీ అరెస్టు కావడం, ఆయన భార్య విజయవాడలో ఉండటంతో రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చి, రెవెన్యూ అధికారుల సమక్షంలో వంశీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, ఆ కేసు నుంచి తప్పించుకోడానికి కిడ్నాప్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను అపహరించి కేసు వాపసు తీసుకోవాలని బెదిరించడం వల్ల ఆయన మేజిస్ట్రేట్ ముందు 161 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చినట్లు బాధితుడి సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో వంశీని అరెస్టుచేసిన పోలీసులు కిడ్నాప్ నకు సహకరించిన మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులను కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మొత్తం 94 మంది నిందితులు ఉండగా, ఇప్పటివరకు 40 మందిని అరెస్టు చేశారు. వంశీ ఈ కేసులో 71వ నిందితుడు కాగా, ముందస్తు బెయిల్ పొందారు. అదేవిధంగా మరికొందరు నిందితులకు కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది. కానీ, ఇంకొందరు వంశీ అనుచరులు పోలీసుల నుంచి తప్పించుకుని అండర్ గ్రౌండులో ఉన్నారు. దీంతో వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మొత్తానికి వంశీకి అన్నివైపులా ఉచ్చు బిగించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం ఆయన మద్దతుదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.