చంద్రబాబు, పవన్ కలుస్తారా?

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించి చాలా కాలమైంది.

Update: 2025-02-15 10:45 GMT

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించి చాలా కాలమైంది. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఏపీ పురోగమనానికి చంద్రబాబు అవసరం ఉందని భావించిన పవన్ ఎన్నికల ముందు ఆయనకు భేషరతుగా మద్దతు ఇచ్చారు. ఇక ఎన్నికల అనంతరం ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కు మంచి ప్రాధాన్యమిస్తూ డిప్యూటీ సీఎంగా నియమించారు చంద్రబాబు. అయితే ఈ ఇద్దరు కలిసి మాట్లాడి చాలా కాలమే అవుతోంది. వెన్నునొప్పి, జ్వరంతో బాధపడుతున్న పవన్ గత కొద్ది రోజులుగా అధికార విధులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మంత్రివర్గ సమావేశంతోపాటు కార్యదర్శుల సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబును ఎప్పుడు కలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఆలయాలను దర్శించుకుంటున్న పవన్ శనివారం మధ్యాహ్నం రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. అనారోగ్యంతో ఇటీవల కాలంలో తన శాఖలకు సంబంధించిన చాలా పనుల్లో ఆయన వెనకబడ్డారు. మంత్రులకు సీఎం ఇచ్చిన ర్యాంకుల్లో కూడా పవన్ చాలా వెనక్కే ఉన్నారని వెల్లడైంది. అయితే అప్పటికే స్పాండిలైటిస్ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్న పవన్ దాదాపు పది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో పలు కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కేరళ, తమిళనాడుల్లోని పలు ఆలయాల దర్శనాలకు వెళ్లారు. రాజకీయాలకు పూర్తి దూరంగా జరిగిన ఈ పర్యటనకు కొద్ది రోజుల ముందే శాఖాధిపతుల సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి పవన్ వెళ్లకుండా ఆలయాల పర్యటనకు వెళ్లడంపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు రేకెత్తించాయి.

అయితే అధికారంలోకి వచ్చాక విధి నిర్వహణలో బిజీ అయిపోవడంతో కొన్ని మొక్కులు తీర్చుకోలేకపోయినట్లు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అనారోగ్యం కారణంగానే పవన్ అధికారిక కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న పవన్ సీఎం చంద్రబాబును కలుస్తారా? లేదా? అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అయితే తలసేమియా రోగులకు సహాయార్థం ఈ రోజు విజయవాడలో నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి పవన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. దీంతో ముఖ్య నేతలు ఇద్దరూ చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉందంటున్నారు. సంగీత దర్శకుడు తమన్ సహకారంతో నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ కు విజయవాడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News