ఒక్క టికెట్ కోసం ముగ్గురు కాంగ్రెస్‌ సీనియ‌ర్ల ప‌ట్టు

Update: 2018-10-15 09:15 GMT
మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం టికెట్ వ్య‌వ‌హారం ముగ్గురు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య చిచ్చుకు కార‌ణ‌మ‌వుతోంది. ఆ టికెట్ త‌మ‌వారికే ఇప్పించుకోవాలంటూ వారు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో కొల్లాపూర్ ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ముగ్గురు సీనియ‌ర్ల‌లో ఎవ‌రు త‌మ పంతం నెగ్గించుకుంటారోన‌ని జ‌నం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కొల్లాపూర్ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో జూప‌ల్లి కృష్ణారావు విజ‌యం సాధించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ల‌భించింది. ఈ ద‌ఫా కూడా ఆయ‌న్నే బ‌రిలో దించాల‌ని గులాబీ ద‌ళం సంక‌ల్పించింది. ఆ పార్టీ విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల తొలి జాబితాలో ఆయ‌న పేరు ఉంది. దీంతో జూప‌ల్లి ఇప్ప‌టికే ప్ర‌చార ప‌ర్వం ప్రారంభించారు. నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

కాంగ్రెస్‌లో మాత్రం ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మ‌హా కూట‌మి పొత్తుల్లో భాగంగా కొల్లాపూర్ టికెట్ కాంగ్రెస్‌కే ద‌క్కే అవ‌కాశ‌ముంది. అయితే, అక్క‌డ త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ఎవ‌ర్ని నిల‌బెట్టాల‌నే విష‌యంపై మాత్రం కాంగ్రెస్ తుది నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జూప‌ల్లి చేతిలో కాంగ్రెస్ అభ్య‌ర్థి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి ప‌రాజ‌యం పాల‌య్యారు. కాబ‌ట్టి ఈసారి కూడా ఆయ‌న‌కే అవ‌కాశ‌మివ్వాల‌ని సీనియ‌ర్ నేత‌-మాజీ మంత్రి డి.కె.అరుణ డిమాండ్ చేస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డికే కొల్లాపూర్‌లో విజ‌యావ‌కాశాలు అధిక‌మ‌ని ఆమె సూచిస్తున్నారు. ఆయ‌న్ను కాద‌ని వేరొక‌రికి టికెట్ ఇస్తే తాను ఊరుకునేది లేదంటూ హెచ్చ‌రిస్తున్నారు.

ఇక కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కూడా కొల్లాపూర్‌లో త‌న వ‌ర్గం వ్య‌క్తినే బ‌రిలో దించాల‌ని తీవ్రంగా కృషి చేస్తున్నారు. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ పోటీ చేసి.. అనంత‌రం కాంగ్రెస్‌లో చేరిన జ‌గ‌దీశ్వ‌ర్ రావుకు టికెట్ ఇప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోసం దిల్లీ పెద్ద‌ల‌తో మంత‌నాలు సాగిస్తున్నారు. మ‌రోవైపు, మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా కొల్లాపూర్ టికెట్‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నారు. జెన్‌కో ఉన్న‌తాధికారిగా ప‌నిచేసి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సుధాక‌ర్ రావుకు టికెట్ ఇప్పించేందుకు పావులు క‌దుపుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో చిన్నారెడ్డి మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన సుధాక‌ర్ రావు ఇంకా కాంగ్రెస్‌లో చేర‌లేదు. టికెట్ ఖ‌రారు చేసుకున్నాకే పార్టీలో చేరాల‌ని ఆయ‌న భావించారు. అయితే, డి.కె.అరుణ నుంచి గ‌ట్టి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతుండ‌టంతో ఆయ‌న చేరిక ఆల‌స్య‌మ‌వుతోంది. మ‌రి ముగ్గురు సీనియ‌ర్ నేత‌లు ఒకే టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్టుతుండ‌టంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవ‌రి మాట‌ను మ‌న్నిస్తుంది? ఎవ‌రిని బుజ్జ‌గిస్తుంది? అనే సంగ‌తి ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News