తల్లిని చూసేందుకు ఆ యువకుడి తపన ప్రపంచానికి కన్నీరు తెప్పిస్తోంది

Update: 2020-07-20 17:00 GMT
నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని ఆఖరి రోజుల్లో పక్కన లేకపోవటమే పెద్ద తప్పు. అలాంటిది.. కడసారి చూసేందుకు దగ్గరకు కూడా వెళ్లలేని దుస్థితికి మించిన శిక్ష మరేం ఉంటుంది? మాయదారి కరోనా కారణంగా ఇప్పుడు ఇలాంటివి చాలానే చోటు చేసుకుంటున్నాయి.

కొద్దిరోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఒక పోలీసులు ఉన్నతాధికారి కరోనా బారిన పడి మరణించటం.. ఆయన అంతిమ సంస్కారాల కోసం ఆసుపత్రి నుంచి అంబులెన్సులోకి తీసుకెళ్లే వేళలో.. ఆ కుటుంబ సభ్యులు పడిన వేదన.. వారిని నిలువరించేందుకు వారి బంధువులు పడిన తపన చూసినప్పుడు అందరి గుండెలు బరువెక్కాయి. మనసంతా చేదు అయిపోయింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రపంచాన్ని ఒక ఫోటో కంట తడి పెట్టిస్తోంది. ఆ యువకుడికి ఏ మాత్రం సంబంధం లేని వారంతా.. అలాంటి పరిస్థితి పగోడికి కూడా రావొద్దని కోరుకుంటున్నారు. పాలస్తీనాకు చెందిన ఒక యువకుడి తల్లి కరోనాతో ఆసుపత్రిలో చేరింది. ఆ దేశంలోని ఆంక్షల నేపథ్యంలో ఆ యువకుడ్ని ఆసుపత్రిలోకి అనుమతించలేదు. దీంతో.. తల్లిని చూసేందుకు ఆ యువకుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

ఇలాంటి వేళలో.. ఆసుపత్రిపైకి ఎక్కి.. అక్కడున్న కిటికీ అద్దంలో నుంచి తన తల్లిని చూసే ప్రయత్నం చేశాడు. మరణానికి దగ్గరగా ఉన్న ఆమెను చూసేందుకు తపించిన కొడుకును చూసిన తల్లి.. తుది శ్వాస వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లికి దగ్గరగా లేని తన అశక్తతకు ఆ యువకుడు కుమిలిపోయాడు. అతగాడి తపనను ఫోటో తీయటం.. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఈ ఫోటో వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేదనకు గురి చేస్తోంది.
Tags:    

Similar News