గుజ‌రాత్ ఈసారి వాళ్ల‌దేనంట‌

Update: 2017-08-10 16:45 GMT
గుజ‌రాత్ రాష్ట్రంలో ఇటీవ‌ల ముగిసిన రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఆ రాష్ట్రంలో రాజ‌కీయ కాక‌ను అమాంతం పెంచేశాయి. మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన అహ్మ‌ద్ ప‌టేల్ ను ఓడించేందుకు మోడీ అండ్ కో చేసిన ప్ర‌య‌త్నాలు తెలిసిందే. పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేసినా.. చివ‌రి క్ష‌ణాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఒక్క‌సారిగా తుదిఫ‌లితం మారిపోయి.. అహ్మ‌ద్ ప‌టేల్ విజేత‌గా నిలిచారు.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌న విజ‌యం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింద‌న్న వ్యాఖ్య చేశారు అహ్మ‌ద్ ప‌టేల్‌.  ఈ ఏడాది చివ‌ర్లో గుజ‌రాత్ అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోడీ.. అమిత్ షాలే ల‌క్ష్యంగా ప‌ని చేస్తామ‌న్న కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన అహ్మ‌ద్ ప‌టేల్‌.. ఈసారికి మాత్రం గుజ‌రాత్ త‌మ‌దేన‌న్న మాట‌ను చెప్పారు.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న గెలుపు కొత్త శ‌క్తిని నింపింద‌ని..  ఆ న‌మ్మ‌కంతోనే తాను చెబుతున్నానంటూ.. 'మేం గుజ‌రాత్ ను కూడా గెలుస్తాం. బీజేపీ నా రాజ్య‌స‌భ ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. చివ‌రికి ఓట‌మే వారికి మిగిలింది. ఈసారి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మా విజ‌యం త‌థ్యం' అని వ్యాఖ్యానించారు. 1995 నుంచి గుజ‌రాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి మ‌రీ ఓడించ‌టానికి పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేయ‌టంపై అహ్మ‌ద్ ప‌టేల్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.
Tags:    

Similar News