లాక్ డౌన్ ను ఉల్లంఘించిన మలక్ పేట ఎమ్మెల్యే

Update: 2020-05-16 05:45 GMT
మరో వివాదంలో చిక్కుకున్నారు మజ్లిస్ సీనియర్ నేత.. మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా. లాక్ డౌన్ వేళ.. ఆయన వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల్ని ఉల్లంఘించినప్పటికీ పోలీసులు పట్టనట్లుగా వ్యవహరించటం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

లాక్ డౌన్ నేపథ్యంలో డబీర్ పురాలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.తాజాగా మలక్ పేట మజ్లిస్ ఎమ్మెల్యే బలాల వాటిని స్వయంగా తీసివేసి.. వాహనాల్ని అనుమతించిన తీరును పలువురు తప్పుపడుతున్నారు. బలాల చర్య ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.బారికేడ్లను తొలగించే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సైతం అభ్యంతరం వ్యక్తం చేయలేదని మండి పడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

అయితే.. ఈ ఉదంతంపై డబీర్ పురా ఇన్ స్పెక్టర్ వాదన వేరేలా ఉంది. తామే బారికేడ్లు తొలగించామని.. ఆ సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యే సాయం చేశారని చెబుతున్నారు. అయితే.. బీజేపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. పాతబస్తీలో మజ్లిస్ నేతల దౌర్జన్యానికి హద్దుల్లేకుండా పోయిందంటున్నారు. ఇటీవల పోలీసుల్ని మాజీ మేయర్ బెదిరించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలోనూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేయలేదని మండి పడుతున్నారు.  ప్రపంచమంతా కరోనాను తరిమికొట్టే పనిలో లాక్ డౌన్ ను పాటిస్తుంటే.. మజ్లిస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News