బరి తెగించిన అసద్ శిష్యుడు

Update: 2016-03-16 14:28 GMT
ఇప్పటికే తన వ్యాఖ్యలతో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశంలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తన గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అనే మాటను అనని చెప్పటంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడికిపోయింది. అసద్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం కాగా.. మరోవైపు మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వారిస్ పఠాన్.. అసద్ వ్యాఖ్యల్ని సమర్థించటం వివాదంగా మారింది.

మహారాష్ట్ర అసెంబ్లీలో భారత్ మాతాకీ జై అనే మాటను అనేందుకు ఇష్టపడని సదరు ఎమ్మెల్యేపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యే వరకూ ఆయన సభకు హాజరు కాకుండా సస్పెన్షన్ ను విధించారు. మరోవైపు.. అసద్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలువురు స్పందిస్తున్నారు.

ఆయన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ.. పలుచోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మల్కాజ్ గిరి కోర్టులో ప్రైవేటు పిటీషన్ దాఖలు కాగా.. అసద్ పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు అలహాబాద్ హైకోర్టులోనూ మజ్లిస్ అధినేతపై చర్యలు తీసుకోవాలని పిల్ దాఖలైంది. మరింత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నా.. అసద్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవటం గమనార్హం.
Tags:    

Similar News