గెల్చినోళ్లు - ఓడినోళ్లు అంతా బిజీ బిజీ!

Update: 2019-01-09 08:39 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన నేత‌లు - ప‌రాజ‌యం పాలైన నాయ‌కులు అంతా ఇప్పుడు బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. త‌మ స‌న్నిహితుల‌తో, స‌హాయ‌కుల‌తో ఎప్ప‌టికప్పుడు స‌మావేశ‌మ‌వుతున్నారు. సుదీర్ఘంగా పేప‌ర్ వ‌ర్క్ చేస్తున్నారు. అన్నీ శ్ర‌ద్ధ‌గా రాసిపెట్టుకుంటున్నారు.

ఇదంతా ఐదేళ్ల త‌ర్వాత వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం వేసుకుంటున్న ప్ర‌ణాళిక కాదు. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌త అంత‌కంటే కాదు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై క‌స‌ర‌త్తులు కూడా కాదు. ఆ త‌తంగ‌మంతా ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము పెట్టిన ఖ‌ర్చు లెక్క తేల్చేందుకే.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థులంతా విధిగా త‌మ ఖ‌ర్చుల వివ‌రాల‌ను నిర్ణీత కాల‌ప‌రిమితిలో ఎన్నిక‌ల క‌మిష‌న్ కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 119 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి మొత్తం 1821 మంది అభ్య‌ర్థులు పోటీ చేశారు. ఈ నెల 15వ తేదీలోగా త‌మ వ్య‌యాలను స‌మ‌ర్పించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ వారి ఆదేశించింది.

ఎన్నికల వ్య‌య వివ‌రాల‌ను స‌మ‌ర్పించ‌డంలో విఫ‌ల‌మైతే అభ్య‌ర్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. గెల్చిన అభ్య‌ర్థుల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది. ఓడిన అభ్య‌ర్థులు తిరిగి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా క‌నీసం మూడ‌ళ్ల‌పాటు నిషేధం విధిస్తారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో 47 మంది అభ్య‌ర్థులు త‌మ ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ కు స‌మ‌ర్పించ‌లేదు. వారిపై ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా వేటుప‌డింది.

ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థుల వ్య‌య ప‌రిమితి రూ.28 ల‌క్ష‌లు. అంత‌కుమించి ఖ‌ర్చు చేస్తే వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది. దీంతో అభ్య‌ర్థులు త‌మ ఖ‌ర్చుల‌ లెక్క‌ల‌ను రూ.28 ల‌క్ష‌లు లోప‌లే చూపించే ప‌నిలో ప్ర‌స్తుతం త‌ల‌మున‌క‌లై ఉన్నారు. వాస్త‌వ ఖ‌ర్చులెలా ఉన్నా.. వాటిని త‌గ్గించి చూపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకు సంబంధిత బిల్లుల‌ను త‌యారుచేసుకుంటున్నారు. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఖ‌ర్చు రూ.40-50 కోట్లు దాటింద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. అంతగా ఖ‌ర్చు చేసిన వారు కూడా ఇప్పుడు ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించే లెక్క‌ల్లో త‌మ ఖ‌ర్చును రూ.28 ల‌క్ష‌ల లోప‌లే చూపుతారంటే.. ఈ లెక్క‌ల్లో ఎన్ని జిమ్మిక్కులు ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చున‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


Full View

Tags:    

Similar News