దత్తత గ్రామాన్నే పట్టించుకోని లోకేశ్

Update: 2018-01-06 04:08 GMT
ఏపీ మంత్రి నారా లోకేశ్ పరువు పోయింది. ఏపీలో పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న ఆయన తాను దత్తత తీసుకున్న గ్రామాన్నే పూర్తిగా గొలికొదిలేయడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు - మాజీ సీఎం ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును దత్తత తీసుకున్న లోకేశ్ అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. అక్కడి పరిస్థితులను ఆయన ఫొటోలతో సహా బయటపెట్టారు.
    
ఏపీలో పంచాయతీరాజ్ - గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉంటూ కూడా దత్తత గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పని చేయక పోవడాన్ని వైసీపీ ఎమ్మెల్యే బయటపెట్టారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరును లోకేష్ దత్తత తీసుకున్నారు. దాదాపు మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఆ గ్రామంలో పర్యటించి అక్కడి పరిస్థితులపై ఫొటోలు తీసుకొచ్చి మీడియాకు అందజేశారు. శిథిలమైన వాటర్ ట్యాంక్ - దెబ్బతిన్న పాఠశాల భవనం - రోడ్లపై మురికి నీరు - ఎండిన చెరువు తదితర ఫొటోలు విడుదల చేశారు. దత్తత గ్రామంలో ఇంత దారుణంగా పరిస్థితులుంటే పట్టించుకోని లోకేష్ - చంద్రబాబు… ఇప్పుడు జన్మభూమి-మా ఊరు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
    
నిమ్మకూరును అభివృద్ధి చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ముందుకొచ్చినా అడ్డుకున్నారని చెప్పారు. నిమ్మకూరు గ్రామానికి వెళ్తే ఎంపీగా ఉన్నప్పుడు హరికృష్ణ వేయించిన సిమెంట్ రోడ్లు తప్ప మరేమీ లేవన్నారు. అంతేకాదు.. లోకేశ్ కు పొట్టకోస్తే అక్షరం ముక్కరాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కనీసం హరికృష్ణను చూసైనా వెళ్లి నిమ్మకూరులో అభివృద్ధి పనులు మొదలుపెట్టాలని లోకేష్‌ కు ఆర్కే సూచించారు.
Tags:    

Similar News