నీరు కారిన ఆరోపణలు : బిల్లులు చెల్లిస్తున్న జగన్ సర్కార్

Update: 2022-05-16 10:30 GMT
నీరు చెట్టు ఈ పధకం టీడీపీ హయంలో చేపట్టారు. ఈ పధకం కింద నాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టారు. ఒక ప్రతిష్టాత్మకమైన పధకంగా దీన్ని నాటి సర్కార్ తలపెట్టింది. అయితే నీరు చెట్టు పధకం కింద విచ్చలవిడిగా అవినీతి జరిగింది అని నాటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసిన మొదటి పని ఈ పధకం మీద విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇవ్వడం. అదే సమయంలో ఈ పధకం కింద కార్యక్రమాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపి వేయడం

దాంతో వారంతా లబో దిబోమన్నారు. తాము పధకం పనులను తమ సొంత నిధులతో చేపట్టామని, అప్పులు తెచ్చి చేశామని బావురుమన్నారు. ఇక ఈ పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా పెరిగిపోయాయి, తమ చేతికి చిల్లి గవ్వ కూడా దక్కలేదని కూడా ఆందోళన చెందారు. మొతానికి చూస్తే వారి ఎంత గోల పెట్టినా వైసీపీ సర్కార్ అయితే అసలు పట్టించుకోలేదు.

అంతే కాదు విజిలెన్స్ దర్యాప్తు అంటూ అలా మూడేళ్ళు ఇట్టే గడచిపోయాయి. ఈ నేపధ్యంలో కాంట్రాక్టర్లు అంతా కోర్టుకు వెళ్ళి న్యాయం కోరారు. వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని కోర్టు చెప్పింది. అయినా కూడా ప్రభుత్వం ఇన్నాళ్ళు జరిగినా ఇవ్వలేదు. ఇపుడు చూస్తే కోర్టు ధిక్కరణ మీద మరోసారి పిటిషన్ వేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో  ప్రభుత్వం  దిగివచ్చి మరీ బిల్లులు చెల్లించేందుకు రెడీ అయింది.

మొత్తానికి టీడీపీ హయాంలో నీరు చెట్టు పధకం పూర్తి అవినీతిమయం అని చెబుతూ వచ్చిన వైసీపీ సర్కార్ మూడేళ్ళు గడచినా ఈ విషయంలో నిజాలు ఏంటో నిరూపించలేకపోయింది అన్న విమర్శలు వస్తున్నాయి. నిజంగా అవినీతి జరిగింది అంటే విచారణలో నిగ్గు తేలాలి కదా. మరి విజిలెన్స్ విచారణలో పొరపాట్లు ఉన్నాయా లేక ఏం జరిగింది అన్నది పక్కన పెడితే వైసీపీ సర్కార్ నీరు చెట్టు పధకం మీద ఇప్పటిదాకా చేస్తూ వస్తున్న ఆరోపణలు అన్నీ నీరుకారిపోయాయి అనే చెప్పాలి.

ఇపుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇందంతా జరుగుతోంది. మరి రేపటి రోజున ఈ విషయంలో అవినీతి జరిగింది అంటూ వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థితి ఉంటుందా అన్నదే చర్చ. మొత్తానికి వైసీపీ విపక్షంలో ఉన్నపుడు టీడీపీ సర్కార్ మీద చేసిన అతి పెద్ద అవినీతి ఆరోపణలలో ఇది ప్రధానమైనది. ఇపుడు ఇది నీరు కారాక వైసీపీ రాజకీయంగా ఇబందిలోపడినట్లే అంటున్నారు.

మరి ఇప్పటికే అమరావతి రాజధాని మీద అవినీతిని కూడా సర్కార్ నిరూపించలేకపోతోంది అన్న ఆరోపణలు ఉన్నాయి. నిజంగా అవినీతి జరిగితే నిగ్గు తేల్చి దోషులను అటు కోర్టు ముందు పెట్టి ప్రజల ముందు కూడా గుట్టు బయటపెడితేనే చేసిన ఆరోపణలకు విలువ ఉంటుంది అంటున్నారు. మరి ఆ పనిలో వైసీపీ సర్కార్ మూడేళ్ళు గడచినా ఎందుకు సక్సెస్ కాలేకపోతోంది అన్నదే ఇక్కడ ప్రశ్న.
Tags:    

Similar News