తెలంగాణకు తరలిపోయిన టీడీపీ ఎంపీ కంపెనీ!?

Update: 2022-12-02 06:09 GMT
గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమర్‌ రాజా బ్యాటరీస్‌ తన మరో యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు డిసెంబర్‌ 2న తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ పాల్గొంటారు.

వాస్తవానికి అమర్‌ రాజా బ్యాటరీస్‌ కంపెనీని ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని ఆ కంపెనీ భావించింది. అయితే అది టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ది కావడంతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఆ కంపెనీని లక్ష్యంగా చేసుకుందని విమర్శలు వచ్చాయి.

అమర్‌ రాజా బ్యాటరీస్‌ కంపెనీ వల్ల కాలుష్యం పెరుగుతోందని.. కంపెనీ వెదజల్లే వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని అంటూ చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్‌ రాజా బ్యాటరీస్‌ కంపెనీని మూసివేయించింది. అయితే అమర్‌ రాజా బ్యాటరీస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలకు అమర్‌ రాజా బ్యాటరీస్‌ అంగీకరించాల్సి ఉంటుందని హైకోర్టు అప్పట్లో తెలిపింది.

దీంతో అమర్‌ రాజా ఏపీలో నెలకొల్పాలనుకున్న తన మరో యూనిట్‌ను తమిళనాడుకు తరలించేసింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఉన్న కంపెనీలను పోయేలా చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

అందులోనూ అమర్‌ రాజా బ్యాటరీస్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో లిస్ట్‌ అయిన కంపెనీ కావడం, వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న కంపెనీ కావడంతో విమర్శలు గట్టిగానే వచ్చాయి.

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమర్‌ రాజా ఈ వాహనాలకు తగ్గట్టు ఎలక్ట్రికల్‌ బ్యాటరీలను సైతం తయారు చేస్తోంది. ఈ రంగంలో కంపెనీకి మంచి అవకాశాలున్నాయనే అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమర్‌ రాజా తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న మరో యూనిట్‌ను తెలంగాణకు తరలించేసింది. తెలంగాణలో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News