అమరావతికి కళ.... వాటికి తెర...?

Update: 2022-04-25 02:30 GMT
మొత్తానికి ఎన్నికల కాక వైసీపీకి బాగానే  తగులుతున్నట్లుగా ఉంది. మొదటి మూడేళ్ళూ వీర లెవెల్ లో  దూకుడు చేసిన వైసీపీ పెద్దలు చివరి రెండేళ్లలో మాత్రం  డ్యామేజ్ కంట్రోల్ ని చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పాత తప్పులకు రిపేర్లు చేసుకుంటూ జనాల మద్దతు పొందేలా చూస్తున్నారు. అందుకే జగన్ అన్నీ ఆలోచించి మునిసిపల్ శాఖను తనకు బాగా సన్నిహితుడు అయిన ఆదిమూలపు సురేష్ కి ఇచ్చారని అంటున్నారు.

ఈ మంత్రి జగన్ కోసం తన తలకాయ కోసుకుంటాను అని చెప్పిన వీర విధేయుడు. ఆయన జగన్ మనసెరిగి మాట్లాడుతారు. అనవసరంగా మీడియా ముందుకు రారు. ఇక వివాదాస్పద ప్రకటనలు అసలు చేయరు. నిజానికి మూడు రాజధానుల వ్యవహారం ఇంతలా రచ్చ కావడానికి వైసీపీ సర్కార్ లోని పలువురి  మంత్రుల వ్యూహాత్మక తప్పులే కారణం అని అధినాయకత్వం భావిస్తోంది. ప్రత్యేకించి సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ అయితే చాలా హాట్ కామెంట్స్ గతంలో చేశారు.

ఆయన చీటికీ మాటికీ మీడియా ముందుకు వచ్చి మూడు రాజధానులు మా విధానం ఎలగైనా  చేస్తామంటూ దబాయింపు ధోరణిలో మాట్లాడుతూ వచ్చారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం మంచి జోరు మీద ఉన్నపుడు అక్కడ ఏముంది అంతా శ్మశానమే అన్న మాటలను కూడా వాడారు.  దాంతో తిక్క రేగిన రైతులు మహోద్యమాన్ని నిర్మించారు.

సరే ఆ తరువాత సరైన విధానం, న్యాయపరమైన అంశాల్లో పొరపాట్లు చేస్తూ మూడు రాజధానుల చట్టం చేయడం కూడా కొంపముంచింది. మొత్తానికి అమరావతి మీద హై కోర్టు తీర్పు ఇచ్చేసింది. అక్కడిదాకా దూకుడు చేసిన వైసీపీ అధినాయకత్వం తీర్పు మీద అప్పీల్ కి వెళ్ళకుండా సంయమనం పాటిస్తూ వచ్చింది. ఇది కీలకమైన మార్పునకు ఉదాహరణ అంటున్నారు.

ఇక మంత్రి వర్గ విస్తరణలో బొత్స నుంచి మునిసిపల్ శాఖను మార్చేసి జగన్ అమరావతి రాజధాని  మీద  తన వైఖరి ఏంటి అన్నది చెప్పేశారు. ఇపుడు  రాజధాని నమూనా మేరకు నిర్మాణాలకు కోర్టుని టైమ్ అడుగుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ లోగా అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయడానికి వైసీపీ సర్కార్ నడుం బిగించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ఆగిన అనేక నిర్మాణాలను పూర్తి చేయడం, తొందరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇచ్చేయడం ద్వారా రాజధాని నడిబొడ్డున వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది.

అదే విధంగా రానున్న రెండేళ్ళూ ఎంతో కొంత అభివృద్ధి చేయడంతో పాటు ఏపీకి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకురావాలని కూడా జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే మూడేళ్ళుగా ఎక్కడికీ వెళ్ళని సీఎం జగన్ వచ్చే నెలలో  దావోస్ టూర్  పెట్టుకున్నారు.  ఇవన్నీ పక్కన పెడితే ఒక విధంగా మూడు రాజధానులు అన్న మాట అయితే మంత్రుల నుంచి ఇక మీదట పెద్దగా వినబడదు అంటున్నారు. జనాల మనసెరిగి వ్యవహరించాలని జగన్ చూస్తున్నారు. ఇంకో వైపు పార్టీని పటిష్టం చేసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది ప్లాన్. మొత్తానికి ఏది ఏమైతేనేం అమరావతి రాజధానికి మంచి రోజులు వచ్చాయని రైతులు సంతోషిస్తున్నారు.
Tags:    

Similar News