అంబటికి కఠిన పరీక్షగా మారిన గడప గడపకు మన ప్రభుత్వం

Update: 2022-08-01 17:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు గెల‌వ‌ని చోట ఆయా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు ఈ కార్యక్ర‌మం నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రించ‌డంతోపాటు సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ఎంత ల‌బ్ధి చేకూరిందో వివ‌రించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌రిగా చేయ‌నివారు ఎవ‌రైనా స‌రే వచ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేద‌ని ఖ‌రాఖండీగా తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే చాలా చోట్ల వీరికి ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదుర‌వుతోంది. అయితే స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించిన‌వారిపై కొంత‌మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. మీరు టీడీపీ అయితే ప‌థ‌కాలు రావ‌ని, ఏ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌బోమ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రికొంత‌మంది నేత‌లు పోలీసుల‌కు చెప్పి ప్ర‌శ్నించివారిపై అక్ర‌మ కేసులు పెట్టిస్తున్నారు.

తాజాగా ఈ కోవ‌లో జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు చేరారు. ప్ర‌స్తుతం అంబ‌టి ప‌ల్నాడు జిల్లా (గ‌తంలో గుంటూరు జిల్లా) స‌త్తెన‌ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా రాజుపాలెంలో మంత్రి ఆగ‌స్టు 1న‌ పర్యటించారు. ఈ క్రమంలో పింఛను కోసం దరఖాస్తు చేసుకొని మూడేళ్లైనా రాలేదని ఓ దివ్యాంగురాలు అంబ‌టిని ప్ర‌శ్నించింది. పక్కనే ఉన్న అధికారులు వాళ్ల ఇంటికి నాలుగు విద్యుత్‌ మీటర్లు ఉన్నాయని.. అందుకే పింఛను ఇవ్వలేదని చెప్పారు. దీంతో మంత్రి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుండగా ఆ మ‌హిళ‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క‌నీసం స‌మాధానం కూడా చెప్ప‌కుండా వెళ్లపోవ‌డం ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అలాగే బుల్లబ్బాయి అనే మరో వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రిపైనా విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయటం లేదని నిప్పులు చెరిగారు. దీంతో అక్కడి పరిస్థితి చూసి మంత్రి అంబటి రాంబాబు వేరే వీధికి వెళ్లిపోయారు. అయితే, ఈ దృశ్యాలు చిత్రీకరించిన మీడియా ప్రతినిధులను మంత్రి అంబ‌టి పీఏ బెదిరించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

పోలీసులు కల్పించుకొని మీడియా ప్ర‌తినిధులు ఫోన్లలో తీసిన వీడియోలను డిలీట్‌ చేయించినట్లు సమాచారం. అనంతరం రాజుపాలెంలోనే మరో ప్రాంతంలో మంత్రి అంబటి పర్యటిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రోడ్లు కావాలని అడిగారు. ఈలోగా మంత్రి పక్కన ఉన్నవారు అతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పగా.. మంత్రి కూడా ‘మీరు తెలుగుదేశమా?... తెలుగుదేశం వారికి రోడ్లు ఎలా వేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏమో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడ‌కుండా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని ఊరువాడా ఊద‌ర‌గొడుతున్నార‌ని.. ఆ పార్టీ నేత‌లు మాత్రం అంబ‌టిలాగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని  మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News