అదేంది అంబటి.. వారి మీద ఫైరింగ్ చేయాలా?

Update: 2016-06-11 04:52 GMT
ముందు వెనుకా చూసుకోకుండా మాట్లాడటం రాజకీయ నేతలకు ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. అలాంటిదేమీ లేకుండా రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మాట్లాడే రాజకీయ నాయకుల పుణ్యమా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నేతలు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. దీనికితాజా నిదర్శనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబును చెప్పాలి. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతల్ని రేపిన తుని రైలు దగ్థం చేసిన ఘటనకు సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే షాక్ తినాల్సిందే.

నేతలన్న వారు ఇలా కూడా మాట్లాడతారా? అన్న డౌట్ రాక మానదు. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం .. ఈ సందర్భంగా సభకు వచ్చిన వారిలో కొందరు చెలరేగిపోవటం.. ఆపై తుని రైల్వే స్టేషన్ కు చేరుకొని రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగలబెట్టటం..  ఆపై తుని పట్టణంలోని పోలీస్ స్టేషన్లను తగలబెట్టటంతో పాటు.. పలు ప్రభుత్వ వాహనాల్ని తగలబెట్టి బీతావాహ వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఊహంచని విధంగా చోటు చేసుకున్న విధ్వంసకాండను చూసి పోలీసులు.. ప్రభుత్వంతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురయ్యారు. ఉవ్వెత్తున ఎగిసి పడిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి విధ్వంసకాండ జరిగింది లేదు. అలాంటిది తుని ఇష్యూలో జరగటం చర్చనీయాంశంగా మారింది.

ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులైన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. దీన్ని నిరసిస్తూ ముద్రగడ పద్మనాభం నిరసన చేపట్టి ఏపీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారాలన్నింటి మీదా మాట్లాడిన అంబటి రాంబాబు నోట ఊహించని వ్యాఖ్యలు చేయటం విశేసం.

తునిలో విధ్వంసకాండ జరుగుతుంటే పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. రైలును తగలబెడుతుంటే పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ ఎందుకు చేయలేదు? వారి మీద కాల్పులు ఎందుకు జరపలేదు? అంటూ ప్రశ్నలు సంధించారు. వేలాది మంది ఒకచోట చేరి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వేళ.. ఏ చిన్నపాటి తప్పు జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తుని నాటి ఘటనను చూస్తే.. ఆందోళనకారుల లక్ష్యం మొత్తం రైలును దగ్థం చేయటం.. పోలీసు.. ప్రభుత్వ కార్యాలయాలు.. వాహనాల మీదనే లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అలాంటి సమయంలో లాఠీఛార్జ్.. కాల్పులు లాంటివి చేసి ఉంటే పరిస్థితి మరెంత భయానకంగా తయారయ్యేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలాది మంది భావోద్వేగంతో ఊగిపోతున్న వేళ.. లాఠీ ఛార్జ్.. కాల్పులు జరపటం లాంటివి పిచ్చి పనుల కిందకు వస్తాయే కానీ.. బాధ్యత కలిగిన ఏ ప్రజా ప్రభుత్వం ఆ తీరులో వ్యవహరించదు. కానీ.. అందుకు భిన్నంగా ఎందుకు కాల్పులు జరపలేదంటూ అంబటి ప్రశ్నిస్తున్న వైనం వింటే నోట మాట రాదంతే. ఎంత రాజకీయ ప్రయోజనాల కోసమైతే మాత్రం.. మరీ ఇంతలా మాట్లాడేస్తారా? కనీస బాధ్యతను మరీ ఇంతలా మర్చిపోవటం ఏమిటి అంబటి?
Tags:    

Similar News