భారత్ నుండి వచ్చేయండి .. తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు

Update: 2021-04-29 06:31 GMT
భారత్ లో కరోనా పరిస్థితి రోజురోజుకి మరింతగా దిగజారుతోంది. ముఖ్యంగా గతరెండు వారాలుగా కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. ప్రతి రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ప్రపంచ రికార్డ్స్ సృష్టిస్తూ యావత్ దేశాన్ని వణికిపోయేలా చేస్తుంది. ఇక కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలని కాల్చడానికి కూడా కనీసం స్మశానం లో చోటు దొరకడం లేదు అంటే పరిస్థితి ఎంతలా దిగజేరిపోయిందో అర్థం అవుతుంది. మొదటి వేవ్ లో కరోనా విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఇండియా  ఇప్పుడు మహమ్మారి దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ పరిస్థితిని చూసి, ఐక్యరాజ్యసమితితో సహా ఎన్నో దేశాలు తమ వంతు సాయం అందిస్తున్నాయి.

మరోవైపు, దేశంలో ప్రతి రోజు మూడున్నర లక్షల వరకు కేసులు నమోదవుతున్న తరుణంలో అమెరికా ఆందోళన చెందుతోంది. ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలైనంత త్వరగా అమెరికాకు చేరుకోవాలని చెప్పింది. లెవెల్-4 ట్రావెల్ అడ్వైజరీ కింద ఇండియాలో ఉన్న తమ పౌరులకు అమెరికా ఈ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ సమయంలో ఇండియాకు ఎవరూ వెళ్లవద్దని, అక్కడున్న వారు త్వరగా తిరిగి రావాలని చెప్పింది. భారత్ నుంచి వచ్చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని తెలిపింది. ఇండియా నుంచి అమెరికాకు ప్రతిరోజు 14 డైరెక్ట్ విమానాలు ఉన్నాయని, యూరప్ గుండా మరిన్ని విమాన సర్వీసులు ఉన్నాయని చెప్పింది.   ఇప్పటికే ఇండియా నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి.  

ఇక ,కరోనా మహమ్మారి రెండో వేవ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇండియాకు సాయమందించేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు రాగా, అమెరికా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 1.5 కోట్ల ఎన్ 95 మాస్క్ లు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్ లను పంపించింది. నేడు తొలి విడత షిప్ మెంట్ ఇండియాకు చేరనుండగా, మిగతావి వచ్చే వారంలోగా ఇండియాకు రానున్నాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో ఇండియా మాకు సాయం చేసింది. ఇదే విధంగా ఇప్పుడు మేము ఇండియాకు సాయపడాలని నిర్ణయించాం" అని వైట్ హౌస్ తెలిపింది.
Tags:    

Similar News