వెనక్కి కాదు.. చంపేయమన్న ‘తెల్ల’ టీచరమ్మ

Update: 2017-02-26 15:08 GMT
అమెరికాలో విద్వేషం ఎంత వెర్రి తలలు వేస్తుందనటానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. వలసల విషయంలో కొందరు అమెరికన్లు ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారో చెప్పే ఉదాహరణగా దీన్ని చెప్పొచ్చు. తెలుగోడు కూఛిబొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపేసిన శ్వేతజాతీయుడి విద్వేషం వేళ.. కొద్ది రోజుల క్రితం ఒక టీచరమ్మ చేసిన విద్వేష ట్వీట్ చూస్తే.. అమెరికన్లలో ప్రాంతీయ విద్వేషం ఎంతగా తలకెక్కిందో ఇట్టే అర్థమవుతుంది.

పిల్లలకు తన పాఠాలతో మంచి బుద్ధుల్ని నేర్పాల్సిన టీచరమ్మ.. అందుకు భిన్నంగా బాధ్యతారాహిత్యంతో చేసిన దారుణ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ నెల 18న సోషల్ మీడియా ట్విట్టర్ లో.. బోన్నీ వర్నె అనే మహిళా టీచరమ్మ దారుణమైన ట్వీట్లను చేసింది. పుష్కరకాలంగా థర్డ్ గ్రేడ్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె..వలసదారులపై విషాన్ని చిమ్మింది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసలపై విరుచుకుపడుతున్న ఆయన సర్కారు తీరుతో భయాందోళనలు నెలకొన్న వేళ.. అక్రమ వలసదారులపై ఈ టీచరమ్మ తీవ్రవ్యాఖ్యలు చేసింది. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపటం కాదు.. ‘జస్ట్ చంపేయండి’ అంటూ ట్వీట్ చేసింది. స్వేచ్ఛా దేశంలో కంపు కొట్టేలా పేరుకుపోయిన చెత్త కుప్పల్లో మునిగిపోతున్నారంటూ వలసదారులు.. శరణార్థుల పట్ల ఏమాత్రం దయ లేని రీతిలోవ్యాఖ్యానించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అమెరికాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ‘పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి వలసల్ని చంపేయండి’ అంటూ ఆమె చేసిన ట్వీట్లపై ఆమె పని చేస్తున్న పాఠశాల యాజమాన్యం స్పందించి కఠిన చర్యలు తీసుకొంది. ఆమెతో సమావేశమైన పాఠశాల యాజమాన్యం ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టటంతో.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయటం గమనార్హం.

ఆమెకున్న హక్కుల్ని తాము గౌరవిస్తామని.. అదే సమయంలో సమాజం పట్ల ఆ తరహా వ్యాఖ్యలు సరికాదని.. స్కూల్ పరిధిలో ఉంటూ చేస్తే అంగీకరించమని.. ఆమె పని చేస్తున్న స్కూల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. వ్యక్తిగత పొరపాట్లను స్కూల్ ఎంత మాత్రం అనుమతించదని స్పష్టం చేసింది. శ్వేతజాతీయలైన కొందరిలో వలసల మీదున్న చులకన భావం ఎంతన్న విషయాన్ని ఈ ఉదంతం కళ్లకు కట్టినట్లు చేస్తుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News