అమిత్ షా టార్గెట్ ఆ ఎంపీనేన‌ట‌

Update: 2017-04-03 07:37 GMT
కొంత‌మందికి కొంత కాలం న‌డుస్తూ ఉంటుంది. గ‌డిచిన కొన్నేళ్లుగా బీజేపీ చీఫ్ అమిత్ షా టైం న‌డుస్తుంది. ఆయ‌న కానీ స్పెష‌ల్ గా టార్గెట్ చేశారంటే చాలు.. దాన్ని చేరుకునే వ‌ర‌కూ విడిచిపెట్ట‌రు. అందుకు త‌గ్గ‌ట్లే గ‌డిచిన కొన్నేళ్లుగా ఆయ‌న విజ‌యాలు సాధిస్తున్నారు. గ‌డిచిన కొన్ని ద‌శాబ్దాల్లో మ‌రే పార్టీకి సాధ్యం కాని రీతిలో అద్భుత‌మైన మెజార్టీని సాధించిన యూపీ మీద కాషాయ జెండాను స‌గ‌ర్వంగా ఎగుర‌వేసిన అమిత్ షా తాజాగా పెట్టుకున్న ల‌క్ష్యం వింటే కాసింత ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. స‌హజంగా ఏదైనా రాష్ట్రాన్ని టార్గెట్ పెట్టుకునే అమిత్ షా.. ఈసారి అందుకు భిన్నంగా ఒక ఎంపీని ల‌క్ష్యంగా చేసుకొని ప్లాన్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ.. ఆ ఎంపీ ఎవ‌రు? అమిత్ షా లాంటి వాడికి కొర‌క‌రాని కొయ్యిలా మారిన ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏమిట‌న్న వివ‌రాల్లోకి వెళితే.. అమిత్ షా టార్గెట్ ఎంత పెద్ద‌దో ఇట్టే తెలుస్తుంది. మిగిలిన వారికి అమిత్ షా టార్గెట్ ఎంత ట‌ఫ్ అన్న‌ది తెలియ‌కున్నా.. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మ‌తం ప్రాతిప‌దిక‌న ఓట్ల‌ను చీల్చేసి.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని కంచుకోట‌లా మార్చేసిన మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానమే అమిత్ షా త‌దుప‌రి ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు.  1984 నుంచి 2014 వ‌ర‌కూ ఎప్పుడు.. ఎలాంటి వేవ్ ఉన్నా స‌రే.. హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానంలో మ‌జ్లిస్ గెలిచే ప‌రిస్థితి. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో జ‌రిగే ఎన్నిక‌ల్లో కాషాయ జెండా ఎగుర‌వేయ‌ట‌మే అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నార‌ని క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు.

ఇందుకు త‌గ్గ వ్యూహాన్ని ఇప్ప‌టి నుంచే సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6 నుంచి 14 వ‌ర‌కు తొలివిడ‌త‌లో హైద‌రాబాద్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. వీటిల్లో పాల్గొనేందుకు ఈ నెల 8న అమిత్ షా వ‌స్తున్న‌ట్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని ప‌టిష్టం చేయ‌టం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ స్థానం బీజేపీకి సొంతం కావాల‌న్న‌దే అమిత్ షా తాజా ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. మ‌రి.. అస‌ద్ కంచుకోట‌ను క‌మ‌ల‌నాథులు కూల్చేస్తారా? అన్న‌ది కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం ఇస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News