వైరల్‌గా బిజినెస్‌ టైకూన్‌ ఫన్నీ ట్వీట్‌!

Update: 2022-10-21 05:59 GMT
సోషల్‌ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే బిజినెస్‌ టైకూన్‌ల్లో ఆనంద్‌ మహీంద్రా ఒకరు. తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఆయన నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఆ అంశాలు ఆయనకు నచ్చితే వారికి సహాయం కూడా చేస్తుంటారు. ఇలా ఇప్పటికే పలువురికి ఇళ్లు కట్టించడం, ఆర్థిక సహాయం చేయడం, ఆటో కొనివ్వడం, ట్రాక్టర్‌ కొని ఇవ్వడం చేశారు. తద్వారా నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్‌ మహీంద్రా మరో ట్వీట్‌ చేశారు.విమానం కాక్‌పిట్‌లోని పైలట్లు విమానం ఎగురుతుండగా కునుకుతీస్తారా? అనే అంశంపై ఓ ఎన్జీవో సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన కథనాన్ని ఆయన ట్విటర్‌లో నెటిజన్లుతో పంచుకున్నారు.

కాగా ఎన్జీవో సర్వే ప్రకారం.. చాలా మంది పైలట్లు విమానం గాల్లో ఉన్నప్పటికీ చిన్నపాటి నిద్ర పోతారని వెల్లడైంది. ఈ సర్వేను ప్రస్తావించిన ఆనంద్‌ మహీంద్రా.. 'గ్రేట్‌..విమాన ప్రయాణం చేసే ముందు దీనిని నేను చదవాల్సిందే'' అంటూ ఫన్నీగా పేర్కొన్నారు.

దీనిపై పలువురు నెటిజన్లు కూడా ఆయనకు ఫన్నీగా సమాధానమివ్వడం విశేషం. ''కంగారు అవసరం లేదు సార్‌.. అసలైన పైలట్లకన్నా.. ఆటోపైలట్‌ బాగా పని చేస్తుంది'' అని ఒకరు పేర్కొనగా, మరొకరు.. అందుకే విమానం కంటే రైలే ఉత్తమం అని ఇంకొకరు సమాధానమివ్వడం గమనార్హం.

కాగా విమానం కాక్‌పిట్‌లో ఉండే పైలట్లు నిద్రపోతున్నారని పలుమార్లు వెల్లడి కావడం విశేషం. ఆగస్టులో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన పైలట్లు నిద్రపోవడంతో సూడాన్‌ నుంచి ఇథియోపియా రాజధాని అడీస్‌ అబాబాకు వెళ్లాల్సిన విమానం నిర్దేశిత విమానాశ్రయంలో ల్యాండ్‌ కాకపోవడం గమనార్హం. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) హెచ్చరించినప్పటికీ నిద్రలో ఉండటంతో పైలట్లు స్పందించలేదు. ఏటీసీ హెచ్చరించిన సమయానికి విమానం భూమి నుంచి 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందని తేలింది.

అయితే ల్యాండ్‌ అవ్వాల్సిన చోట కాకుండా విమానం ముందుకు వెళ్లిపోతుంటే ఆటోపైలట్‌ వ్యవస్థ దానంతట అదే డిస్‌కనెక్ట్‌ అయిపోతుందని చెబుతున్నారు. ఆ తర్వాత వెంటనే పైలట్లను అప్రమత్తం చేస్తూ అలారం మోగుతుందని పేర్కొంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News