త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌రుగా ఆనందిబెన్‌?

Update: 2016-08-18 09:02 GMT
దేశంలో ప‌లు రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్ల‌ను మార్చ‌డంతో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌కు కూడా ప‌ద‌వీ గండం త‌ప్ప‌ద‌ని వినిపిస్తోంది. ఆయ‌న ప‌ద‌వీకాలం పూర్తయినా కూడా కొన‌సాగించాల‌ని త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత ఇప్ప‌టికే కేంద్రాన్ని కోరారు. కానీ... కేంద్రం ఆమె విన‌తిని ప‌ట్టించుకునే ప‌రిస్థితులు లేవ‌ని తెలుస్తోంది. రోశ‌య్య స్థానంలో క‌ర్ణాట‌క‌కు చెందిన సీనియ‌ర్ బీజేపీ నేత శంక‌ర‌మూర్తికి అవ‌కాశ‌మిస్తార‌ని వినిపిస్తోంది. కానీ... జ‌య ఆ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని.. వీలైతే రోశ‌య్య‌ను కొన‌సాగించాల‌ని, లేదంటే క‌ర్ణాట‌కేత‌ర రాష్ట్రాల నేత‌ల‌ను నియ‌మించాల‌ని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కొత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది. రోశ‌య్య‌ను కొన‌సాగించాల‌న్న జ‌య కోరిక‌ను తీర్చ‌లేని ప‌రిస్థితుల్లో ఆమె సూచించిన రెండో ప్ర‌తిపాద‌న‌నైనా అంగీక‌రించాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. జ‌య‌తో కేంద్రానికి ప్ర‌స్తుతం మంచి సంబంధాలే ఉండ‌డంతో ఆమె కోరిక మేర క‌ర్ణాట‌క కాకుండా వేరే రాష్ట్రాల నేత‌ల‌ను నియ‌మించాల‌ని మోడీ అనుకుంటున్నార‌ని.. అందులో భాగంగా ఇటీవ‌ల తొల‌గించిన గుజ‌రాత్ సీఎం ఆనంది బెన్ ప‌టేల్ ను త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌రుగా పంపిస్తార‌ని ఢిల్లీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన రోశ‌య్య 2011లో సుర్జిత్ సింగ్ బ‌ర్నాలా త‌రువాత త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి యుపిఎ ప్ర‌భుత్వం ఆయ‌న్ను నియ‌మించినా అనంత‌ర కాలంలో ఏర్ప‌డిన ఎన్డీయే ప్ర‌భుత్వం కూడా కొన‌సాగిస్తోంది. యూపీయే ప్ర‌భుత్వం నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్‌ ల‌ను మార్చి కొత్త‌వారిని నియ‌మిస్తున్నా రోశ‌య్య జోలికి మాత్రం రాలేదు. బీజేపీకి, అన్నా డీఎంకేకే మంచి సంబంధాలు ఉండ‌డ‌మే కాకుండా రోశ‌య్య కూడా అన్నాడీఎంకే ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాల కొన‌సాగిస్తుండ‌డంతో ఆయ‌న ప‌దవిలో కొన‌సాగ‌గ‌లిగారు. రోశ‌య్య ప‌ద‌వీకాలం ముగిశాక క‌ర్ణాట‌క‌కు చెందిన బిజెపి నాయ‌కుడు శంక‌ర్‌ మూర్తికి ఇవ్వాల‌ని ఎన్డీయే ప్ర‌భుత్వం అనుకున్నా  త‌మిళ‌నాడుతో క‌ర్ణాట‌క‌కు కావేరీ జ‌లాల  విష‌యంలో విభేదాలున్న నేప‌థ్యంలో జ‌య నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

దీంతో శంక‌ర‌మూర్తి నియామకం పై బిజెపి అధిష్టానం కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. దీంతో గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి ఆనందిబెన్ పేరు తెర‌పైకి వ‌స్తోంది. మోడీతో మంచి సంబంధాలున్నా ప‌ద‌వి కోల్పోయిన ఆనందికి న్యాయం చేయాల‌ని మోడీ అనుకుంటుండ‌గా.. జ‌య కూడా ఆమె పేరునే సూచించార‌ని  అన్నాడిఎంకె వ‌ర్గాలు అంటున్నాయి. ఇదే నిజ‌మైతే సీఎం పోస్టు పోయినా బీజేపీలో ఆనంది ప్రాధాన్యం ఏమాత్రం త‌గ్గ‌లేద‌నే అనుకోవాలి.
Tags:    

Similar News