ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి..ఓ బ్ర‌హ్మ‌ ప‌దార్థం

Update: 2018-04-23 08:10 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో బీజేపీ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా ఇంకా చెప్పాలంటే అంతుచిక్క‌ని రీతిలో సాగుతున్నాయ‌ని అంటున్నారు. పార్టీ పెద్ద‌ల తీరు ఓ ర‌కంగా, ప్రాంతీయ నేత‌ల తీరు మ‌రో ర‌కంగా ఉండ‌టంతో అస‌లింత‌కు పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నే ఆస‌క్తి క‌లుగుతోంద‌ని చెప్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విష‌యంలో ప్ర‌తిపక్షాలు - సామాన్యులు అంతా పార్టీన దోషిగా చూస్తున్న క్ర‌మంలో పార్టీ బ‌లోపేతానికి త‌గిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అగ్ర‌నాయ‌కత్వం అలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా లీకుల‌తో స‌రిపెడుతూ ఉన్న తీరు పార్టీ ఇమేజ్‌ ను డ్యామేజ్ చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం తాజాగా జ‌రుగుతున్న అధ్యక్ష ఎంపిక ప‌రిణామాల‌ని పేర్కొంటున్నారు.

అనూహ్య రీతిలో ఎంపీ - అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న హ‌రిబాబును బీజేపీ అధిష్టానం ప‌ద‌వి నుంచి ఊడ‌బీకేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రాజీనామాను ఆమోదించిన ఢిల్లీ పెద్ద‌లు కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకుంటామ‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు జాతీయ క‌మిటీలో స్థానం క‌ల్పించారు. అయితే రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌వి మాత్రం భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో రెండు వ‌ర్గాలుగా నాయ‌కులు చీలిపోయార‌నే టాక్ ఉన్న సంగ‌తి తెలిసిందే. మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌ - మాజీ అధ్యక్షుడు హరిబాబు టీడీపీ అధినేత అనుకూల వ‌ర్గంగా - మాజీ కేంద్ర‌మంత్రి పురంధీశ్వ‌రి - మాజీ మంత్రులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ - మాణిక్యాల‌రావు పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్య‌తిరేకంగా వ‌ర్గం పేరుంది. ఈ వ‌ర్గంలో నుంచి వీర్రాజుకు లేదా పురంధీశ్వ‌రికి ప‌ద‌వి ద‌క్క‌వ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. ఈ క్ర‌మంలోనే వీర్రాజు పేరు ఖ‌రారు అయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి.

టీడీపీ ధీటుగా ఎదుర్కోవ‌డంలో ముందుండే వీర్రాజును అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నుకోవ‌డం ద్వారా పార్టీ బ‌లోపేతానికి కృషి చేయ‌వ‌చ్చ‌ని, నాయ‌కుల్లో స్థైర్యం నింప‌వ‌చ్చ‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు ఢిల్లీ వ‌ర్గాలు ఆయ‌న పేరును ఓకే చేసిన‌ట్లుగా, ఒక‌ట్రెండు రోజుల్లో ఆదేశాలు కూడా ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వచ్చాయి. అయితే ఈ చ‌ర్చ జ‌రిగిన దాదాపు వారం వ‌ర‌కు కూడా ఎలాంటి చ‌డీచ‌ప్పుడు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇంత‌కీ భ‌ర్తీ చేస్తారా లేదా అనే సందేహాన్ని కూడా కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. ఇదిలాఉండ‌గా... మాజీ మంత్రి - బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి రాజీనామా చేసిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష రేసులోకి వచ్చారు. ఐతే....కన్నా అధ్యక్ష పదవిపై పలువురు బీజేపీ నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో గుంటూరులోని తన నివాసంలో తన అనుచరులతో కన్నా భేటీ అయ్యారు. ఇప్పటికే వైసీపీ నేతలతో కన్నా టచ్ లో ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags:    

Similar News