అడ్రస్ లేకున్నా ఆరాట పడుతున్నారు..

Update: 2015-04-07 17:30 GMT
పోయిన చోటే వెతుక్కోవాలనే సిద్దాంతాన్ని నమ్ముకున్నారో లేకపోతే...ఉన్నవాళ్లనయినా కాపాడుకోవాలని భావించారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు కాస్త దూకుడు గానే వెళ్తున్నారు. మొన్నటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇపుడు ప్రజా సమస్యలపై పడ్డారు.
 
ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వాహనాలకు తెలంగాణ సర్కారు ఎంట్రీ ట్యాక్స్ విధించిన విషయం తెలిసిందే. దీన్ని ఎత్తివేయాలంటూ, ఏపీలో ఉన్న కరువు పరిస్థితులపై స్పందించాలని కోరుతూ గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాష్ర్టాలకు కస్టోడియన్ గా ఉంటున్న వ్యక్తిగా అన్ని అంశాలు కోర్టు వరకు వెళ్లకుండా చూడాలని కోరారు. కావాలంటే కొన్ని విషయాల్లో ఇరు రాష్ర్టాల పాలకులను కూర్చోబెట్టి మాట్లాడాలని సూచించారు.
 
మొత్తానికి కాంగ్రెస్ నేతల్లో దూకుడు అయితే కనిపిస్తోంది. గుండుగుత్తగా ఓడిపోయిన నేపథ్యం, పార్టీకి బైబై చెప్తున్న నాయకులున్న పరిస్థితుల్లో ఉన్న వారితో షో నడిపించేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే చిరంజీవి లాంటి వారు సైతం హాజరు కావడం ఆసక్తికరమే. ఆరాటంతో కూడిన ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళితే కాంగ్రెస్ కు భవిష్యత్ అవకాశాలు బాగానే ఉంటాయంటున్నారు.
Tags:    

Similar News