ఏపీ కాంగ్రెస్ కు జంప్ జిలానీల బెడ‌ద‌!

Update: 2018-08-31 10:41 GMT
2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నానంత‌రం ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైన సంగ‌తి తెలిసిందే. అంప‌శ‌య్య‌పై ఉన్న కాంగ్రెస్ కు జ‌వ‌స‌త్వాలు తీసుకువ‌చ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నానా తిప్ప‌లు ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీలో వెంటిలేట‌ర్ పై ఉన్న కాంగ్రెస్ కు 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎలాగోలా ఊపిరి పోయాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి - బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి వంటి మాజీ కాంగ్రెస్ నేత‌ల‌ను సొంత‌గూటికి తెచ్చుకుంది. పాతవారిని సొంత‌గూటికి తెచ్చుకోవ‌డంతో పాటు కొత్త‌వారిని ఆక‌ర్షించేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లెట్టింది. కానీ, అందుకు భిన్నంగా మూలిగే న‌క్క‌మీద తాటికాయ్ ప‌డ్డ‌ట్లు త‌యారైంది కాంగ్రెస్ ప‌రిస్థితి. కొత్త నేత‌లు పార్టీలో చేర‌డం సంగ‌తి దేవుడెరుగు...ఆల్రెడీ కాంగ్రెస్ లో సీనియ‌ర్ నేత‌లు కూడా జింపింగ్ జ‌పాంగ్...అంటూ దుకాణం స‌ర్దేయడానికి ప్లాన్ చేస్తుండ‌డంతో కిం క‌ర్త‌వ్యం అంటూ కాంగ్రెస్ అధిష్టానం త‌ల‌లు ప‌ట్టుకుంటోంది.

2019లో పోటీ చేయ‌డం ద్వారా మ‌ళ్లీ ఉనికి చాటుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అలా చేసి...క‌నీసం 2024లోనైనా పుంజుకోవాల‌ని అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇటువంటి స‌మ‌యంలో పార్టీకి మ‌ద్ద‌తుగా ఉండాల్సిన మాజీలు....ఏమాత్రం రాజీ ప‌డ‌కుండా వేరే పార్టీల్లోకి జంప్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వ‌డం హైక‌మాండ్ ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శైల‌జా నాథ్ సైకిలెక్కేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌...చంద్ర‌బాబును క‌లిశార‌ట‌. అయితే, త‌మది రాజ‌కీయ భేటీ కాద‌ని ఆయ‌న తేల్చి చెప్ప‌డం కొస‌మెరుపు. మ‌రో కాంగ్రెస్ నేత కొండ్రు ముర‌కీ కూడా చంద్ర‌బాబును క‌లిశార‌ట‌. రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న బరిలోకి దిగాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. కాంగ్రెస్ కు చెందిన మ‌హిళా నేత కిల్లి కృపారాణి కూడా పార్టీని వీడ‌డం ఖాయమ‌ని టాక్. అయితే, శ్రీ‌కాకుళంలో రామ్మోహ‌న్ నాయుడు - అచ్చెన్నాయుడు....ఉండ‌డంతో టీడీపీలోకి ఎంట్రీ క‌ష్టంగా ఉంద‌ట‌. దీంతో, వైసీపీలోకి వెళ్లేందుకు ఆమె మొగ్గుచూపుతున్నార‌ట‌. శ్రీ‌కాకుళం వైసీపీ నుంచి దువ్వాడ శ్రీ‌నివాస్ - టెక్క‌లి నుంచి తిల‌క్ ఆల్రెడీ అక్క‌డ సీటు ఆశిస్తున్నార‌ట‌. ...సో కిల్లికి సీటు గ్యారెంటీ కాద‌ట‌. దీంతో, త‌మ పార్టీ నేత‌లు జారిపోకుండా....కాపాడుకోవ‌డం కోసం కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు ర‌చిస్తోంద‌ట‌.
Tags:    

Similar News