850 కోట్లను బాబు సర్కారు అలా ఖర్చు చేసిందా?

Update: 2016-04-09 06:04 GMT
ఏ లెక్కకు ఆ లెక్కగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఒకదాని కోసం ఉద్దేశించిన నిధుల్ని మరో అవసరానికి వినియోగిస్తే ఎలాంటి తిప్పలు ఎదురవుతాయో.. తాజాగా ఏపీ సర్కారు పడుతున్న ఇబ్బందిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏపీ రాజధాని అమరావతిలో భవనాలు నిర్మించేందుకు కేంద్రం ఇచ్చిన రూ.850 కోట్ల నిధులకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. విభజన చట్టంలో భాగంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసే రాజధానిలో సచివాలయం.. అసెంబ్లీ.. హైకోర్టు తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణానికిఅవసరమైన వ్యయాన్ని కేంద్రం భరించాల్సి ఉంది.

ఇందుకు తగ్గట్లే కేంద్రం ఆ మధ్యన రూ.850 కోట్లను విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణాల కోసం వినియోగించాల్సిన ఈ నిధుల్ని వేరే అవసరాల కోసం వినిగించిన రాష్ట్ర సర్కారు.. రాజధాని నిర్మాణాల కోసం మరిన్ని నిధులు ఇవ్వాలని కోరింది. దీంతో.. మోడీ సర్కారు స్పందించి.. తాము మొదట విడుదల చేసిన రూ.850 కోట్ల ఖర్చుకు సంబంధించిన లెక్క చెప్పాల్సిందిగా బాబు సర్కారును కోరింది. ఖర్చు సంబంధించిన లెక్కను చూపాలంది.

తాజాగా కేంద్రానికి పంపిన ఏపీ సర్కారు నివేదికను చూస్తే.. రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ కింద రైతులకు ఇచ్చిన పరిహారం.. పింఛన్లు.. రాజధాని నిర్మాణం కోసం కన్సల్టెంట్లకు ఇచ్చిన మొత్తాన్ని కేంద్ర నిధుల నుంచి తీసుకున్నట్లుగా లెక్కలు చెప్పింది. మరి.. ఏపీ సర్కారు చెప్పిన లెక్కలపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అయినా.. రాజధానిలో భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తే.. ఇతర అవసరాల కోసం బాబు సర్కారు ఖర్చు చేయటం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News