ఎదురుదెబ్బలకు సిద్ధపడే బయల్దేరాలి!

Update: 2015-09-09 04:02 GMT
చంద్రన్నయాత్ర బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదలు కాబోతోంది. రైతన్నల అభివృద్ధికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో ఉన్నదో.. ఎంతగా కష్టపడి పనిచేస్తున్న దో రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా ముగ్గురు మంత్రుల బృందం ఆధ్వర్యంలో ప్రచారం చేసుకోవడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. బుధవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు 13రోజుల పాటూ 13 జిల్లాలో ఈ యాత్ర సాగుతుంది. మంత్రులు కిమిడి మృణాళిని, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాధరెడ్డి ఇందులో సభ్యులు. వీరితో పాటూ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా పర్యటిస్తారు. రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ మాత్రం చేశాం.. అన్నదాతకు నిత్యం అండగానే ఉంటాం.. అని చెప్పుకోవడం వీరి ఉద్దేశం.

అయితే జిల్లాల నుంచి తెలుస్తున్న దాన్ని బట్టి.. చంద్రన్న యాత్రకు ఎదురుదెబ్బలు కూడా తప్పవని అనిపిస్తోంది. రుణమాఫీ పొందలేకపోయిన రైతులు ప్రతి ప్రాంతంలోనూ ఉన్నారు. యాత్ర రూపంలో మంత్రులు జిల్లాల్లో రైతుల వద్దకు పర్యటిస్తే.. మాఫీ పొందిన వారికంటె.. పొందలేకపోయిన వారు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలకు హాజరై ఆందోళన చేసే అవకాశం ఉంది. అందుకే ఎదురుదెబ్బలకు సిద్ధపడితేనే యాత్రకు బయల్దేరాలని పలువురు అంటున్నారు.

28వేల కోట్ల రైతురుణాలను మాఫీ చేసేస్తున్నాం. కానీ అంత విలువైన మైలేజీ మన ప్రభుత్వానికి రావడం లేదు. అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. పలు కేబినెట్‌ సమావేశాల్లో మంత్రి వర్గ సహచరుల మీద అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడం జరిగింది. నేను ఇంత చేస్తున్నాను. మీరు కనీసం నేను చేస్తున్న పనులను ప్రచారం చేయడానికైనా ఉపయోగపడకపోతే ఎలా? అంటూ ఆయన మంత్రుల మీద కోపించిన సందర్భాలున్నాయి. అలా తమ సేవలకు తగిన ఫలితం లభించడం లేదని చాలా కాలం పాటు మధనపడిపోవడానికి ఫలితంగా చంద్రన్న యాత్ర అనే ప్రచార కార్యక్రమం రూపుదిద్దుకుంది. అయితే అచ్చంగా ప్రభుత్వం గురించి టముకు వేసుకోవడం ఒక్కటే కార్యక్రమం అయితే పరువు పోతుందనే భయంతో.. రైతులను కలిసి వారి విజ్ఞప్తులను కూడా స్వీకరిస్తారనే కార్యక్రమాన్ని దీనికి జత చేశారు. మొత్తానికి రైతు సంక్షేమం కోసమే ఈ యాత్ర జరుగుతున్న లుక్‌ తీసుకువచ్చారు.

చంద్రన్న యాత్ర మొదలు కాగానే.. జిల్లాల్లో రైతన్నలు మంత్రులకు అక్కడక్కడా ఝలక్‌ లు తినిపించడం ఖాయం. అయితే నాయకులు పైకి ఇప్పటిదాకా మాఫీ వర్తించని రైతులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం అని అంటున్నారు గానీ.. ఇది కేవలం వారిని మాయ చేయడానికి మాత్రమే. పైగా ఇప్పటిదాకా మాఫీ కాని వారుంటే.. వారు కేవలం దరఖాస్తుతో ఆగకపోవచ్చు. అందుకే చంద్రన్న యాత్రకు ప్రజాప్రతిఘటనలు తప్పవని పలువురు అనుకుంటున్నారు.
Tags:    

Similar News