ఏపీకి తీరని నష్టం.. అందరూ కలిసి ముంచేశారు

Update: 2020-03-19 02:30 GMT
ఎప్పుడో నిర్వహించాల్సిన ఎన్నికలను రాజకీయం చేసి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు హడావుడిగా 25 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టి ప్రక్రియ మొదలు కాగా మళ్లీ రాజకీయాల కోసం అడ్డు తగిలారు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం ఏర్పడనుంది. యథావిధిగా ప్రకటించినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా పెద్దమొత్తంలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయే ప్రమాదం ఉంది. రాజకీయాలు చేయాలి గానీ రాష్ట్రాన్ని పణంగా పెట్టి రాజకీయాలు చేయడం సరికాదని మేధావులతో పాటు ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాటికి 2018 ఆగష్టుతో పదవీకాలం ముగిసింది. అప్పుడు నిర్వహించాల్సిన చంద్రబాబు 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహిస్తే ఫలితం తనకు వ్యతిరేకంగా వస్తుందనే భయంతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ బాధ్యతలు చేపట్టి చక్కదిద్దుకోవడానికి పది నెలలైంది. ఈ సమయంలో ఆయనకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుంటే 14వ ఆర్థిక సంఘం నిధులు రావని గుర్తించారు. ఈ మేరకు ఆగమేఘాల మీద ఎన్నికలకు సిఫారసు చేయగా ఎన్నికల సంఘం ఆ మేరకు ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. నామినేషన్లు పూర్తయ్యాయి.. ఉపసంహరణ పూర్తయి ఇక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారని పక్కనపెడితే ఆ ఎన్నికలు ఆరు వారాల తర్వాత నిర్వహించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం లేదు.

పంచాయతీలకు నూరు శాతం గ్రాంట్ మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయడంతో దాని ప్రకారం 2018-20 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీకి రూ.4,065.79 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ.858.99 కోట్లు మంజూరు చేశారు. మిగతా మొత్తం మంజూరు కావాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం ఆ నిధులను మంజూరు చేయడం లేదు. మార్చి 31తో 14వ ఆర్థిక సంఘం గడువు ముగిసిపోతుండడంతో ఆ నిధులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల వాయిదాతో 31వ తేదీలోపు ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. దీంతో ఆ నిధులపై ఏపీ ఆశలు వదులుకోవాల్సిందే. ఈ ఎన్నికల నిర్వహణను రాజకీయం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల వాయిదాపై నెలకొన్న రాజకీయంపై ప్రజలు విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై కోర్టులో కూడా న్యాయం జరిగే అవకాశం లేదు. కోర్టు విచారణ వేగంగా జరిగినా 31వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. దీంతో ఆ నిధులపై ఆశలు వదులుకోవాల్సిందే. అధికార, ప్రతిపక్షాలు కలిసి చివరకు ఎన్నికలను నిర్వహించకుండా చేయడంతో రాష్ట్రానికి నిధులు రాకపోవచ్చు. ముందే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇలాంటి పరిణామాలు విఘాతం కలిగిస్తాయని ప్రజలతో పాటు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News