అన్నా హజారే అంటే దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. సార్వత్రిక ఎన్నికలకు ముందు లోక్ పాల్ కోసం పోరాటం చేసి ఊపు ఊపిన ప్రజా నాయకుడు. ఎన్నికల తర్వాత ఆయన అనుచరులు అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ తదితరులు చెల్లాచెదురు అవటంతో అన్నాహజారే సైతం నిమ్మకుండిపోయారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో రైతుల నుంచి అక్రమంగా భూములు సేకరిస్తున్నారని పేర్కొంటూ పలువురు రైతులు వెళ్లి అన్నాహజారేను కలిశారు. ఆ సమయంలో వారికి మద్దతుగా హజారే మాట్లాడారు. అయితే ఇపుడు హజారే నేరుగా రంగంలోకి దిగి బాబుకు ఇబ్బంది కలిగించనున్నారని తెలుస్తోంది.
'ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా పేరుంది. బహుళ పంటలు పండే భూములను రాజధానికి వినియోగించవద్దు. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆహారభద్రతకు చాలా అవసరమైన ప్రాంతాలు. మా మిషన్ సభ్యులు ఇటీవల రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులు చాలా సమస్యలు చెప్పారు' అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్నాహజారే లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానికి భూ సేకరణపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై అన్నాహజారే అభ్యంతరం వ్యక్తం చేశారు.
బలవంతంగా తమ పంట భూములు తీసుకుంటున్నారని రైతులు తమ మిషన్ సభ్యుల ఎదుట అవేదన వ్యక్తం చేశారని హజారే ఆ లేఖలో పేర్కొన్నారు. భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించారని రైతులు ఆందోళనతో తమ సభ్యులకు చెప్పారని చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నాహాజారే వివరించారు. ఏపీలో వ్యవసాయేతర భూములను ప్రకటించి ఆ భూములు రాజధాని నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నాహజారే స్పష్టం చేశారు.
అయితే భూ సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్నాహజారే పర్యటించడం వల్ల ప్రయోజనం ఏముంటుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్నాహజారే పర్యటన చంద్రబాబుకు ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.