ఒక తెలుగుమ్మాయి... ఆకాశ వీధి క‌థ‌

Update: 2017-07-26 15:57 GMT
విమాన‌యాన రంగంలో బోయింగ్ విమానానికి ఉండే ప్ర‌త్యేక‌త గురించి చెప్ప‌క్క‌ర్లేదు. బోయింగ్ న‌డిపే క‌మాండెంట్లలో మ‌హిళ‌లు అతి త‌క్కువగా ఉంటారు. ఇక ఈ జాబితాలో తెలుగువారి లిస్ట్ తీస్తే అత్యంత‌ అరుదు అనే చెప్ప‌వ‌చ్చు. అయితే విజ‌య‌వాడ‌లో విద్యాభ్యాసం చేసిన‌ దివ్య అనే అమ్మాయి ఈ అరుదైన ప్ర‌త్యేక‌త‌ను త‌న సొంతం చేసుకుంది. పంజాబ్‌లోని ప‌ఠాన్ కోట్ మూలాలున్న త‌ల్లి...తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ వాసి అయిన తండ్రి గారాల ప‌ట్టి అయిన దివ్య స్పెయిన్‌లో బోయింగ్ విమానం న‌డిపే శిక్ష‌ణ తీసుకుంది. విజ‌య‌వాడ‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న దివ్య విజ‌యగాథ ఇప్పుడు అనేక మంది అమ్మాయిల‌కు ఆద‌ర్శంగా మారింది.
 
మాజీ సైనికోద్యోగి కుమార్తె అయిన దివ్య‌కు చిన్నప్పటి నుంచి పైలట్ కావాలన్న కోరిక చాలా బలంగా వుండేది. ఈ విష‌యాన్ని త‌న తల్లిదండ్రుల‌కు వెల్ల‌డించగా వారు సైతం ఓకే చెప్పారు. దీంతో యూపీలోని రాష్ర్టీయ ఉరాన్ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ పొందింది. ఈ శిక్ష‌ణ పూర్త‌యిన త‌ర్వాత‌ ముంబైలో ఎయిర్ ఇండియాలో పోస్టింగ్ వచ్చింది. అనంత‌రం తన 19 ఏట బోయింగ్ విమానం నడపడంలో శిక్షణ కోసం స్పెయిన్ వెళ్లింది దివ్య‌. ఆ తర్వాత లండన్‌లోనూ ట్రైనింగ్ పొందిన దివ్య, ప్రపంచంలో బోయింగ్ 777 విమానం నడిపే కమాండ్లలో అతి చిన్నవయసు గల అమ్మాయిగా ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ ప్లయిట్స్‌లో కెప్టెన్ కూడా అయిన దివ్య ఇప్పటివరకు 30దేశాలకు పైగా విమానాలను నడిపింది.

ఇంట‌ర్మీడియట్ వ‌ర‌కు విజ‌యవాడ‌లో చ‌దివిన దివ్య త‌న ఏపీలో విద్యాభ్యాసం గురించి ప్ర‌శంసించింది. విజ‌య‌వాడ‌లో అత్యుత్త‌మ విద్య‌ను అభ్య‌సించే అవ‌కాశం ద‌క్కింద‌ని ప్ర‌శ్నించింది. త‌న ఆశ‌యాన్ని నెర‌వేర్చుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపింది. సింగింగ్, డ్యాన్సింగ్ త‌న‌కు చాలా ఇష్టమ‌ని దివ్య తెలిపింది. అమ్మాయిలు త‌మ ల‌క్ష్య‌సాధ‌న వైపు శ్ర‌మించి సాగితే ఫ‌లితం ఉంటుంద‌ని పేర్కొంది
Tags:    

Similar News