మరో లండన్ యాత్రా నారాయణా?

Update: 2017-09-20 03:57 GMT
రాజధానిని ప్రపంచం మెచ్చే నగరంగా చేసేస్తాం అనే మాయమాటల అర్థం.. ఆ ముసుగులో అధికారులు మంత్రులు ప్రపంచం మొత్తం చుట్టి రావడేమో ఏమోనన్న పరాచికాలు ప్రజల్లో మొదలవుతున్నాయి. అమరావతి నగర డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులు అండ్ కో.. మరోసారి లండన్ యాత్రకు సిద్ధం కావడం అనేది.. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం కాదు కదా.. నవ్వులపాలు చేస్తోంది. ఈ బృందం లండన్ వెళ్లినా కాలయాపన తప్ప జరిగేదేమీ ఉండదని.. అక్కడినుంచి డిజైన్లు తయారై నార్మన్ సంస్థ వారు వచ్చి చూపించినప్పుడు.. చంద్రబాబునాయుడు చాలా సింపుల్ ‘తూచ్’ అనేసి మళ్లీ కొత్తగా తయారుచేయండి.. అని తేల్చేస్తారని జనం నవ్వుకుంటున్నారు. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసి.. రోజులు నెట్టేయడమే ప్రభుత్వం తీరుగా ఉన్నదని అంటున్నారు.

ఒకసారి డిజైన్లు ఓకే చేస్తే గనుక.. వెంటనే పనులు ప్రారంభించడమూ.. వచ్చే ఎన్నికల్లోగా రాజధాని నిర్మాణ పనుల్లో ఎంతో కొంత పురోగతి చూపించడమూ ప్రభుత్వ బాధ్యత అవుతుంది. విఫలమైతే ఎన్నికల  ప్రజాకోర్టులో శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. అందుకే డిజైన్ల పేరిట అప్పటిదాకా కాలహరణం చేసేస్తేగనుక.. ‘‘అమరావతిని అద్భుత నగరంగా చేయాలన్నదే నా కల. అందుకే ఆలస్యం అయినా పర్లేదు కానీ.. డిజైన్ల విషయంలో రాజీపడకూడదని నిర్ణయించుకున్నాను. నాణ్యత విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే అవకాశం లేదు’’ అంటూ మాయమాటలు చెప్పి ప్రజలను మరోసారి నమ్మించవచ్చుననేది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం కావచ్చునని జనం అనుకుంటున్నారు.

నిజానికి కోర్ కేపిటల్ లో హైకోర్టు మరియు శాసనసభ లకు సంబంధించి నార్మన్ అండ్ ఫోస్టర్స్ ఇటీవల తెచ్చిన డిజైన్లు అధికార్లలో కూడా చాలా మందికి నచ్చాయని.. కానీ పైన చెప్పుకున్న లాభనష్టాలను బేరీజువేసుకున్న తరువాత.. చంద్రబాబునాయుడు వాటిని తిరస్కరించారని కూడా అమరావతిలో వినిపిస్తోంది. అందుకే మంత్రి నారాయణ బృందం మరోసారి లండన్ యాత్రకు తయారవుతోంది. డిజైన్ చేయించడం అనే పనికి ఇన్ని విదేశీ యాత్రల రూపేణా.. అయ్యే కోట్లాది ప్రజాధనం వృథాకు ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి.

పైగా చంద్రబాబు అండ్ కో ఇప్పుడు  ఈ డిజైన్ల వ్యవహారంలో రాజమౌళిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. రాజమౌళి బృందాన్ని కూడా లండన్ కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి వీరి ఖర్చు మొత్తం ప్రభుత్వానికి భారమే కదా.. అనే వాదనలు ప్రజల్లో వినవస్తున్నాయి. 
Tags:    

Similar News