వివేకా హత్య దర్యాప్తుపై మరో పిటీషన్

Update: 2022-02-24 06:44 GMT
సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయంలో పులివెందుల కోర్టులో  మరో కేసు దాఖలైంది. వివేకా హత్య కేసులో అనుమానితులుగా ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిలో ఒకడైన శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో ఈనెల 21వ తేదీన ఒక పిటీషన్ దాఖలు చేశారు. ఆమె వాదన ప్రకారం తన భర్తకు వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే సీబీఐ అధికారులు ఎవరితోనో కుమ్మక్కై తన భర్తను కేసులో ఇరికించారట.

ఇదే సమయంలో హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లను తులశమ్మ అనుమానితులుగా పేర్కొన్నారు. మామగారు వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖరరెడ్డి పాత్రపై ఎన్ని అనుమానాలున్నా, ఆరోపణలున్నా సీబీఐ ఇంతవరకు ఆయన్ను ఎందుకు విచారించలేదని ఆమె తన పిటీషన్లో ప్రశ్నించారు.

 వివేకాకు వేరే మహిళతో సంబంధాలున్నాయని, ఆస్తులతో పాటు డబ్బు తదితరాలను వివేకా ఆమెకు రాసిచ్చేస్తున్నట్లు జరిగిన ప్రచారాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ నేపధ్యంలోనే కూతురు, అల్లుడికి వివేకాతో చాలాసార్లు గొడవలు జరిగిందనే ప్రచారాన్ని ఆమె చెప్పారు. మరి ఆమె పిటీషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే తెలశమ్మ ప్రస్తావించిందని కాకపోయినా వివేకాతో కుటుంబసభ్యులకి గొడవలు జరిగినట్లు బాగా ప్రచారంలో ఉంది.

 జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రచారాన్ని సీబీఐ ఎందుకని పరిగణలోకి తీసుకోలేదు ? ఎందుకని అల్లుడు రాజశేఖరరెడ్డిని విచారించలేదో అర్ధం కావటంలేదు. ఇపుడు జరుగుతున్న ఆస్తి గొడవలు, హత్యలు అత్యధికం కుటుంబసభ్యుల ప్రమేయంతో జరుగుతున్నవనే విషయాలు పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. మరీ నేపధ్యంలో తులశమ్మ పిటీషన్ పై కోర్టు సానుకూలంగా స్పందిస్తే దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశముంది. అల్లుడి ప్రమేయం ఉందా లేదా అన్నది దర్యాప్తు ద్వారానే అధికారులు ప్రపంచానికి చెబితే బాగుంటుంది. మరి పిటీషన్లో పేర్కొన్న ఇతరుల పేర్లపై కోర్టు ఏమంటుందో చూడాలి.

అయితే ఈ కేసులో సీబీఐకి గతంలో ఎన్నడూ ఎదురుకాని పరిణామాలు ఎదురవుతున్నాయి. నిందితులు కొత్త కొత్త మార్గాల్లో విచారణను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేసులు పెట్టడం, బెదిరించడం, భయపెట్టడం వంటివి చేస్తున్నారంటే వారి వెనుక ఉన్నది ఎవరు? వారికి అంత ధైర్యం ఎలా వచ్చిందన్నది అందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది.
    

Tags:    

Similar News