ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారి సేవలకు సెలవు

Update: 2019-10-20 08:43 GMT
వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు సెలవు పలుకుతూ నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయినప్పటికీ ఈ ఏడాది మార్చి 31 నాటికి సేవలు అందిస్తున్న ఉద్యోగుల్ని తక్షణమే తొలగించేలా నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు.. ప్రభుత్వ ఆదేశాల్ని అమలు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు.. ముఖ్య కార్యదర్శులు.. కార్యదర్శుల్ని వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ముందు పేపర్ నోటిఫికేషన్.. నియామక ప్రక్రియ ద్వారా కాకుండా నియమించిన వారిలో రూ.40వేలకు పైనే వేతనం తీసుకుంటున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు.. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. ఈ ఉత్తర్వులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇవేకాక కార్పొరేషన్లు.. అటానమస్ సంస్థలకు కూడా ఈ జీవో వర్తిస్తుందని పేర్కొన్నారు. తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాల్ని సాధారణ పరిపాలనా శాఖకు.. ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖాళీ అయ్యే కొలువులు కొత్త వారికి దక్కే వీలుందని చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పదవీ విరమణ చేసిన వారినే కొనసాగించటం కారణంగా కొత్త వారికి అవకాశాలు దక్కటం లేదని అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో.. కొత్త ఉద్యోగాల భర్తీ అంశం మీద చర్చ జరిగింది. జనవరిలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారికి కొలువులు కేటాయించాలని నిర్ణయించారు.

గత ప్రభుత్వంలో రిటైర్ అయిన పలువురు ఉద్యోగులు..కీలక పోస్టుల్లో ఉన్న వారు అధికారపార్టీకి దగ్గరగా ఉన్న వారిని కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అంశాల్లో ప్రక్షాళన చేసేందుకు వీలుగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News