ఏపీ హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం: ‌డాక్టర్ సుధాక‌ర్ కేసు సీబీఐకి అప్ప‌గింత‌!

Update: 2020-05-22 08:50 GMT
ప్ర‌భుత్వం పై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో స‌స్పెండ్‌ కు గుర‌యిన డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన నిర్ణ‌యం తీసుకుంది. డాక్ట‌ర్ సుధాక‌ర్ మతిస్థిమితం కోల్పోవ‌డానికి ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టులో వేసిన పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వ నివేదిక తప్పు దారి పట్టించేలా - నిజాలు దాచి రాసినట్టు అనిపిస్తోంది న్యాయ‌స్థానం పేర్కొంది.

డాక్ట‌ర్ సుధాకర్ వ్యవహారంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది.8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి త‌మ‌కు నివేదిక ఇవ్వాలని సూచించింది. మెజిస్ట్రేట్ నివేదికలు - ప్రభుత్వ నివేదికలు రెండూ తెప్పించుకున్నామ‌ని - డా.సుధాకర్‍ శరీరం పై గాయాలున్నాయని మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో ఉందని హైకోర్టు ప‌రిశీలించింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో డాక్టర్ సుధాకర్ గాయాల ప్ర‌స్తావ‌న లేద‌ని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయని న్యాయ‌స్థానం తెలిపింది. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని కోర్టు పేర్కొంది.

మూడు రోజులుగా డాక్ట‌ర్ సుధాకర్ కేసును హైకోర్టు విచారణ చేస్తోంది. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తూ వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంది. అనంత‌రం డాక్ట‌ర్ సుధాక‌ర్ త‌ల్లి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగం తిరిగిస్తాం - సైలెంటుగా ఉండండి అని ప్రభుత్వంలో కొందరి నుంచి ఫోన్లు వచ్చాయని ఆరోపించారు. ఉద్యోగం కోసం తాము ఇప్పుడు వెనక్కు తగ్గితే కష్టకాలంలో త‌మ‌కు అండగా నిలిచిన వారిని అవమానించినట్టు అవుతుందని పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణ‌యం ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలింది. విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేలా ఉంది.
Tags:    

Similar News