ఏపీ హైకోర్టు విస్తరణకు రూ. 30 కోట్లు..మర్మం ఏమిటో !

Update: 2021-08-18 07:38 GMT
ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబరులో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధాని గా ఏర్పాటు చేస్తామని చట్టం చేసింది. దానికి అనుగుణంగా కర్నూలులో ఏపీ హైకోర్టుతో పాటుగా వివిధ న్యాయ సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఏపీ లోకాయుక్త కార్యాలయం, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యాలయాలను త్వరలో కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నట్టు క్యాబినెట్ సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది. అదే సమయంలో అమరావతిలోని ఏపీ హైకోర్టు భవనాలను విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు ప్రాంగణంలోనే కొత్త భవనాల నిర్మాణాలకు టెండర్లు కూడా పిలిచింది.

అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ, ఉత్తరాంధ్రలోని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగానూ, రాయలసీమలోని కర్నూలుని న్యాయరాజధానిగా చేయాలని ఏపీ ప్రభుత్వం చట్టం చేసింది.శాసనసభ, శాసనమండలిలో అనేక మలుపులు తిరిగినా చివరకు 2020 జూలైలో ఆమోదం పొందింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆమోదించిన పాలన వికేంద్రీకరణ చట్టం , సీఆర్డీయే రద్దు చట్టాలను పలువురు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు.ప్రస్తుతం కోర్టు స్టే విధించడంతో ఏడాదిన్నరగా పాలనా వ్యవహారాలు అమరావతి నుంచే కొనసాగుతున్నాయి. అదే సమయంలో రేపోమాపో రాజధాని తరలింపు అంటూ నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతకొన్ని రోజులుగా పెండింగ్‌ లో ఉన్న ప్రతిపాదనల్ని అంగీకరించని ప్రభుత్వం ఇటీవల హఠాత్తు గా ఆమోదించింది. రూ. 29 కోట్ల 40 లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు భవనం కార్యకలాపాలకు సరిపోవడం లేదు. దీన్ని విస్తరించాలన్న ప్రతిపాదనలు మొదటి నుంచి ఉన్నాయి. 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అయితే న్యాయరాజధానిని కర్నూలుకు తరలించాలన్న ఉద్దేశంతో ఇంత కాలం ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టారు. అయితే , తాజాగా దీనికి ఆమోదం తెలిపారు.

ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం హైకోర్టు భవనం కాదు. దాన్న జిల్లా కోర్టుగా వినియోగించుకుంటారు. అసలు హైకోర్టు భవనానికి డిజైన్లు ఖరారు కావడం ఆలస్యం కావడంతో ముందుగా ఈ భవనాన్ని శరవేగంగా నిర్మించారు. అసలు హైకోర్టు భవనం నిర్మాణం ప్రరంభమైంది. పునాదులు కూడా వేశారు. కానీ ప్రభుత్వం మారడంతో అన్ని అమరావతి నిర్మాణాల్లాగే వాటినీ నిలిపివేశారు. నిర్మాణం కొనసాగి ఉంటే శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయి ఉండేది. కానీ ఆ నిర్మాణం నిలిపివేయడంతో ప్రస్తుతం ఉన్న భవనం హైకోర్టు కార్యకలాపాలకి సరిపోవడం లేదు. అదనపు భవన నిర్మాణంపై హైకోర్టు నుంచిచాలా కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి.

అయితే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకనుకున్నారో కానీ, కర్నూలుకు తరలిపోయే హైకోర్టుకు అదనపు ఖర్చు ఎందుకు అనుకున్నారో కానీ హైకోర్టు ప్రతిపాదనల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి కారణం ఏమిటో రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు. ఆగస్టు 15 వేడుకల ప్రసంగంలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. ఆ తర్వాత హైకోర్టు విస్తరణకు అనుమతి ఇచ్చారు. ఈ పరిణామాలతో సహజంగానే ప్రభుత్వ విధానంపై రకరకాల చర్చలు జరగుతూ ఉంటాయి.


Tags:    

Similar News