స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కేసీయార్... గుడివాడ హాట్ కామెంట్స్

Update: 2023-04-10 21:38 GMT
ఏపీలో ఎలాగైనా కాలూనాలని బీయారెస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా వేడిగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ఇష్యూని టేకప్ చేసింది. ఎట్టి పరిస్థితులలోనూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానీయవద్దు అంటూ కేటీయార్ ఈ మధ్యనే కేంద్రానికి లేఖ రాశారు. అందులో మూడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ని అప్పనంగా ప్రైవేట్ రంగానికి కట్టబెట్టడం మీద విమర్శలు చేశారు.

కేంద్రం అయిదు వేల కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు దేశంలో వేల కోట్ల రూపాయలను కార్పోరేట్ శక్తులకు ధారపోస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి హక్కు అయిన స్టీల్ ప్లాంట్ ని కాపాడలేదా అని ఆయన నిలదీశారు. స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం ప్రైవేట్ సెక్టార్ నుంచి సాయాన్ని ఆహ్వానిస్తూ జారీ చేసిన టెండర్ల ప్రక్రియను కూడా ప్రశ్నించారు.

ఇక దీని మీద మరో అడుగు ముందుకేసిన కేసీయార్ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన టెండర్లలో పాలు పంచుకుంటామని బిడ్ వేస్తామని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అమ్మడానికి నిర్ణయం తీసుకుంటే తాము కూడా పాలుపంచుకుంటామని బీయార్స్ ప్రభుత్వం డిసైడ్ అయింది అని అంటున్నారు.

ఆ పని ఏపీ ప్రభుత్వం కూడా చేయవచ్చు కదా మీరు కూడా బిడ్ లో పాల్గొంటారా అని మంత్రి గుడివాడ అమరనాధ్ ని మీడియా ప్రశ్నించినపుడు ఆయన చాలా లాజికల్ గా రియాక్ట్ అయ్యారు. కేంద్రం ప్రైవేట్ పరం చేయాలని అమ్మాలని స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయం తీసుకుందని తెలిసిన దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ని అమ్మేయవద్దు అంటూ ఒకే ఒక స్టాండ్ తో ఉన్నది మా ప్రభుత్వం అని ఆయన చెప్పారు.

ఆ మీదట  కేంద్రం ప్రైవేట్ దిశగా ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా వ్యతిరేస్తామని ఆయన అన్నారు. ఆ సమయంలో కేంద్రం ప్రైవేట్ పరం చేసే దిశగా స్టెప్స్ వేయాలనుకుని   బిడ్డ ని ఇన్వైట్ చేస్తే మేము ఎలా పాల్గొంటామని ప్రశ్నించారు. ఇక బీయారెస్ వారు కూడా స్టీల్ ప్లాంట్ ని అమ్మవద్దు అని డిమాండ్ చేయడం చూశామని అలాంటిది వారే అమ్మితే కొంటామని అంటున్నారని మీడియాలో అంటున్నారని ఆయన అన్నారు.

నిజానికి అమ్మవద్దు అని చెప్పి మళ్లీ వాళ్లే కొంటాననడమేంటి అని ఎదురు ప్రశ్నించారు. అయినా స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొంటామని ఏమైనా బీయారెస్ అధికారికంగా ప్రకటించిందా అని ఆయన మీడియానే అడిగారు. రాజకీయంగా ఎన్నో మాటలు అంటూ ఉంటారని వాటిని పట్టుకుని తాము మాట్లాడడం తగదని అన్నారు. మొత్తానికి తాను మాట్లాడను అంటూనే కేసీయార్ నాయాకత్వంలోని బీయారెస్ పార్టీకి స్టీల్ ప్లాంట్ విషయంలో ఉన్న ద్వంద్వ విధానాలను ఆయన ఎండగట్టారు.

ఏది ఏమైనా వైసీపీ తరఫున లాజికల్ గానే ఆయన జవాబు చెప్పారు కానీ నిజంగా కేంద్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూంటే అమ్మవద్దు అంటూ ఒకే ఒక స్టాండ్ తో వైసీపీ ఉండిపోతే దాని వల్ల లాభమేంటో కూడా చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు కేంద్రాన్ని నిలదీసి నియంత్రించే విధానం కూడా వైసీపీకి ఉండాలి కదా అన్నదే ఇపుడు జనాల నుంచి వస్తున్న ప్రశ్న.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News