జీరో ఎఫ్ఐఆర్... తెలంగాణ కంటే ఏపీనే ముందుంది

Update: 2019-12-03 01:57 GMT
నిజమే... మహిళల పై అఘాయిత్యాలను అరికట్టే విషయంలో తెలంగాణ కంటే కూడా ఏపీ చాలా ముందుందనే చెప్పక తప్పదు. ఓ పక్క దిశ ఘటన తో తెలంగాణలో పోలీసుల తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతుంటే... అలాంటి పరిస్థితి మన కొద్దన్న రీతిలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఓ చర్య ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. దిశ ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ - ముంబై నగరాల్లో మాత్రమే అమల్లో ఉన్న జీరో ఎఫ్ఐఆర్ ను ఇఫ్పుడు ఏపీలో అమలు చేసేందుకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ లెక్కన చూస్తే.. మహిళల పై అఘాయిత్యాల నివారణలో కేసీఆర్ కంటే తానే ముందున్నట్లుగా జగన్ చెప్పేసినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

దిశ ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోనే విదివిధానాలు రూపొందించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. డీజీపీ ఆదేశాలు అందగానే... దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీలు కసరత్తులు ప్రారంభించారు.  ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ విధానంఅమల్లోకి వస్తే... సరిహద్దులతో సంబంధం లేకుండా దగ్గర్లో ఉన్న ఏ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఫైల్ చెయ్యెచ్చు. దానిపై తక్షణ విచారణ జరిపిన అనంతరం, ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు సదరు కేసు బదిలీ అయిపోతుంది.

దిశపై దారుణ హత్యాచారం ఘటనలో తెలంగాణ పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. తమ పరిధిలోకి రాదంటూ పలు పోలీస్ స్టేషన్లకు తమను తిప్పారంటూ దిశ తల్లిదండ్రులు వాపోయిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్గత విచారణ చేసిన తెలంగాణ పోలీసు శాఖ అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది. దీంతో ఏపీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దిశ ఘటనతో తీవ్ర కలత చెందిన  సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ జీరో ఎఫ్ఐఆర్ అమలు దిశగా చాలా వేగంగా చర్యలు ప్రారంభించారు. మరి ఈ తరహా విధానాన్ని తెలంగాణ పోలీసులు ఎప్పుడు అమల్లోకి తెస్తారో చూడాలి.
Tags:    

Similar News