వైజాగ్ : రెడ్లు.. కమ్మలు మమ్మల్ని వదిలేయండి...?

Update: 2022-11-09 11:35 GMT
విశాఖ అంటే గత మూడు దశాబ్దాలుగా వలసలకు పెద్ద పీట వేస్తోంది అన్నది తెలిసిందే. ఎక్కడ నుంచి వచ్చినా విశాఖ వాసులు సులువుగా గెలిపించేస్తారు అన్నదే నాయకుల ధీమా. దానికి తగినట్లుగా రాజకీయ పార్టీలు కూడా ప్రతీ ఎన్నికకూ నాన్ లోకల్స్ కే టికెట్లు ఇస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. గట్టిగా చెప్పాలంటే 1984లో మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి మాత్రమే చిట్టచివరి విశాఖ లోకల్ ఎంపీగా రికార్డులు చెబుతాయి.

ఇక గత కొన్ని దశాబ్దాలుగా నెల్లూరు, ప్రకాశం సహా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే విశాఖ ఎంపీలుగా గెలిచారు. ఇపుడు కూడా పక్క జిల్లాకు చెందిన వారే వైసీపీ తరఫున విశాఖ ఎంపీగా ఉన్నారు. ఈ పరిణామాలకు తోడు కులాల పరంగా చూసుకున్నా ఎంతసేపూ అయితే రెడ్లు లేకపోతే కమ్మలకే విశాఖ ఎంపీ సీటు రిజర్వ్ అయిపోయినట్లుగా భావిస్తున్నారు.

పార్టీలు వేరు అయినా 2009 నుంచి చూసుకుంటే వరసగా దగ్గుబాటి పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, ఎంవీవీ సత్యనారాయన విశాఖ నుంచి ఎంపీలు అయ్యారు. ముగ్గురూ కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అని చెప్పాలి. వీరికి ముందు 2004లో ఎంపీ అయిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఆయనకు ముందు టీ సుబ్బరామిరెడ్డి ఎంపీ అయ్యారు. ఈ ఇద్దరు కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు, విశాఖకు నాన్ లోకల్స్.

ఇక వీరికంటే ముందు ఎంవీవీఎస్ మూరి నాన్ లోకల్ గానే ఉంటూ విశాఖ ఎంపీగా రెండు సార్లు పనిచేశారు.  ఈ నేపధ్యంలో ఈ రెండు సామాజికవర్గాలకే విశాఖ సీటు కట్టుబడిపోయిందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. దాంతో ఎంతసేపూ రెడ్డి కమ్మలకేనా విశాఖ సీటు మేము ఏం చేయాలని లోకల్ గా ఉన్న బీసీలు ఇపుడు గట్టిగా గొంతు చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక విశాఖ ఎంపీ సీటు పరిధిలో కాపులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే వారికి కూడా ఇప్పటిదాకా అవకాశం దక్కలేదు. దాంతో రీ రెండు ప్రధాన సామాజిక సెక్షన్లు గోల పెడుతున్నాయని అంటున్నారు. వైసీపీ అయినా టీడీపీ అయినా బీసీలకు అవకాశం ఇవ్వడంలేదు అన్న అవేదన అయితే వారిలో ఉంది. వైసీపీకి 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మను పోటీకి పెట్టింది. ఆమె ఓడిపోయారు.

ఇక 2019 నాటికి ఏరి కోరి ఒక బిల్డర్ అయిన ఎంవీవీ సత్యనారాయణను తీసుకువచ్చి విశాఖ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన శ్రీ భరత్ కి టికెట్ ఇచ్చింది. 2014లో చూస్తే టీడీపీ బీజేపీ పొత్తులో కమ్మ సామాజికవర్గానికి చెందిన హరిబాబు పోటీ చేశారు. ఆయన కంటే ముందు వరకూ టీడీపీకి ఎంవీవీఎస్ మూర్తి పర్మనెంట్ అభ్యర్ధిగా ఎంపీ సీటుకు ఉండేవారు.

మరి పార్టీలు ఇలా సంకుచితంగా ఆలోచిస్తూ నాన్ లోకల్స్ ని కేవలం ఒకటి రెండు సామాజికవర్గాల వారికే టికెట్లు ఇవ్వడం పట్ల జనాలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కాస్తా   2009 ఎన్నికలో బాగా బయటపడింది. ఆనాడు ప్రజారాజ్యం తరఫున బీసీ అయిన పల్లా శ్రీనివాసరావుకు టికెట్ ఇస్తే ఆయన ఏకంగా రెండున్నర లక్షల ఓట్లను తెచ్చుకుని సత్తా చూపించారు.

ఇక జనసేన కూడా 2019 ఎన్నికల్లో సీబీఐ  మాజీ జేడీ లక్ష్మీనారాయణకు టికెట్ ఇచ్చింది. కాపు సామాజికవర్గానికి ఆయనకు రెండు లక్షల ఎనభై వేల పై చిలుకు ఓట్లు దక్కాయి అంటే అది ఆయా సామాజికవర్గాల ఆకాంక్షను తెలియచేస్తోంది అని చెప్పాలి.

మొత్తానికి చూస్తే 2024 ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ అయితే పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా ఆ దిశగా సరైన అభ్యర్ధిని పోటీకి దించకపోతే మాత్రం కచ్చితంగా దెబ్బేసేందుకు విశాఖ బీసీలు రెడీగా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News