విశాఖే రాజధాని...ఇది ఎన్నోసారి ...?

Update: 2022-12-13 02:30 GMT
విశాఖ మన రాజధాని. పాలన తరలివస్తుంది అంటూ మంత్రి గుడివాడ అమరనాధ్ గత ఆరేడు నెలలుగా ఒకే పాట పాడుతున్నారు. ఆయనకు అది పాతగా అనిపించకపోయినా వినేవారికి మాత్రం రోతగానే ఉంది అంటున్నారు. అయింది అయితే చెప్పాలి. అవుతుంది అనుకున్నా చెప్పాలి కానీ ఇలా ఊరించి ఉడికించి ఎంతకాలం మంత్రిగారూ అంటున్నారు అంతా.

మరో వైపు చూస్తే విశాఖ రాజధాని అన్నది ఇపుడు ఎవరికీ కిక్ ఇవ్వడం లేదు. అంతదాకా ఎందుకు విశాఖ వాసులే దాన్ని లైట్ గా తీసుకుంటారు.  2019 చివరి నుంచి ఇలా ప్రచారం చేయడం మొదలెట్టారు. ఇపుడు చూస్తే కచ్చితంగా మూడేళ్ళు పై దాటింది. అయినా సరే విశాఖ వైపు గా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ మధ్యలో హై కోర్టు అమరావతి ఏకైక రాజధాని అంటూ తుది తీర్పు ఇచ్చింది.

సుప్రీం కోర్టులో ప్రస్తుతం రాజధాని కేసు విచారణ దశలో ఉంది. 2023 జనవరి 31కి ఈ విచారణ జరగనుంది. పైగా సమగ్రంగా ఈ కేసు పూర్వపరాలు అన్నీ వింటామని సుప్రీం చెప్పిన నేపధ్యంలో విచారణ ఎపుడు పూర్తి అవుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. అలా కాకుండా విశాఖకు రాజధానిని తీసుకురావడం అన్నది కుదురుతుందా అన్న చర్చ ఒక వైపు ఉంది.

ఇవన్నీ ఇలా ఉండగానే విశాఖ మన రాజధాని అంటూ వీలు కుదిరినపుడల్లా మంత్రి హోదాలో గుడివాడ బల్లగుద్దుతున్నారు. పైగా ఆయన మరో మాట అంటున్నారు. తనను నిద్రలో లేపి అడిగినా ఈ విషయమే చెబుతాను అంటూ ఒక ముహూర్తాన్ని లేటెస్ట్ గా ప్రకటించారు విశాఖ రాజధానిగా మారడం తధ్యమని అన్నారు. 2023 విద్యా సంవత్సరం నుంచి జగన్ విశాఖను పాలనా రాజధానిగా చేసుకుని పాలిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.

జగన్ ఒక్కరే  విశాఖ  రారని ఏకంగా సెక్రటేరియట్ కూడా తరలివస్తుంది అని గుడివాడ చెప్పారు. ఇలా విశాఖ గురించి మంత్రి గారు చెబుతూంటే మాత్రం అందరూ అవునా అని వింటున్నారు తప్ప పెద్దగా ఆసక్తిని చూపడంలేదు. ఎందుకంటే ముందే చెప్పుకునట్లుగా ఇది అయ్యేదేనా అన్న ఆలోచన కూడా చాలా మందిలో ఉంది మరి. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది విశాఖకు అనేక విషయాల్లో ప్రాముఖ్యత మాత్రం ఉంది. జీ 20 సదస్సుకు విశాఖను వేదికగా చేసుకున్నారు.

అదే విధంగా విశాఖలో గ్లోబల్ ఇవెస్టిమెంట్ సమ్మిట్ ని మార్చిలఒ నిర్వహిస్తున్నారు అలా విశాఖలో అనేక కీలకమైన సదస్సులు జరగనున్నాయి. దాంతో రాజధాని కాకపోయినా విశాఖ ప్రాముఖ్యత మాత్రం బాగా పెరగడం ఖాయం. ఆ ఖ్యాతి విఖ్యాతి తమకు చాలు అని విశాఖ వాసులు అంటున్నారు. మరి అంతటితో ఆగుతుందా లేక నిజంగా మంత్రిగా పదే పదే చెబుతున్నట్లుగా విశాఖ రాజధాని అవుతుందా అంటే వేచి చూడాల్సిందే. అయితే వచ్చే ఏడాది జూన్ అంటే ఇక్కడ మరో ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలలో ఉంది అని అంటున్నారు. అదేంటి అంటే అప్పటికి సుప్రీం కోర్టులో తీర్పు కూడా ఒక కొలిక్కి వస్తుందని దాని వల్ల తాము విశాఖను ఎంచుకోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News