జనవరి 25 రాత్రి అసద్ అలా చేస్తాడట!

Update: 2020-01-05 10:54 GMT
మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మొన్నటి వరకూ విమర్శలు చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. కొద్ది రోజులుగా గళం విప్పుతున్నారు. నిన్నటికి నిన్న సంగారెడ్డిలో బహిరంగ సభను నిర్వహించిన ఆయన.. దమ్ముంటే తనను బీజేపీ నేతలు చంపాలంటూ సవాల్ విసిరారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన.. అమలు సాధ్యం కాదంటున్నారు.

దేశంలోని 120 కోట్ల జనాభాలో కేవలం ఆరు శాతం మాత్రమే పాస్ పోర్టుల ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో డాక్యుమెంట్లు సమర్పించటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పేదరికం.. నిరక్షరాస్యత కారణంగా కోట్లాది మంది ప్రజల వద్ద సరైన డాక్యుమెంట్లు లేవన్నారు.

నిరసకారుల నుంచి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని యూపీ సర్కారు నోటీసులు జారీ చేయటం ఎంతవరకూ సబబు? అని ప్రశ్నించిన అసద్.. గతంలో అసోం.. హర్యానా.. గుజరాత్ లలో జరిగిన అల్లర్లలో వందల కోట్ల ఆస్తి నష్టం జరిగినా ఆస్తులు స్వాధీనం చేసుకోలేదన్నారు. హైదరాబాద్ లో 30 శాతం జనాభా వద్దే జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర జనాభాలో కేవలం 30 శాతం మంది దగ్గరే జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయే అనుకుందాం. దశాబ్దాల తరబడి మజ్లిస్ ఏలుబడిలో ఉన్న నియోజకవర్గాల మాటేమిటి? అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారికి మిత్రపక్షంగా ఉంటే మజ్లిస్.. పాతబస్తీని ఎందుకు డెవలప్ చేయలేకపోయింది? అక్కడి ప్రజల ఉపాధిని ఎందుకు పెంచలేదు? పేదరికాన్ని ఎందుకు తగ్గించలేకపోయింది? నిరక్షరాస్యతను ఎందుకు నిర్మూలించలేకపోయింది.

మరే పార్టీకి సాధ్యం కాని రీతిలో పాతబస్తీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు గంపగుత్తగా మజ్లిస్ కే ప్రతి ఎన్నికల్లో అక్కడి ఓటర్లు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు.. అక్కడి ప్రజల జీవన ప్రమాణం ఎందుకు పెరగటం లేదు? ఎన్నో నీతులు చెప్పే అసద్.. తన అడ్డాలో.. తనను నమ్మి దశాబ్దాలుగా ఓటేస్తున్న వారి ప్రయోజనాల్ని ఎందుకు పరిరక్షించటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత.. మిగిలిన విషయాల మీద మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 25 అర్థరాత్రి 12 గంటల వేళ చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి.. జాతీయ గీతాన్ని ఆలపిస్తానని చెప్పారు. అంతేకాదు.. సీఏఏ కు వ్యతిరేకంగా జనవరి 26కు ముందే ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగ పీఠికను చదువుతున్న వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మరి.. అసద్ మాటల్ని ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారో చూడాలి. జనవరి 25 అర్థరాత్రి 12 గంటల వేళ చార్మినార్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి కేసీఆర్ సర్కారు అనుమతి ఇస్తుందంటారా?



Tags:    

Similar News