కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటకు మంట పుట్టేలా అసద్ వ్యాఖ్యలు

Update: 2020-08-24 12:37 GMT
కాంగ్రెస్ అధినాయకత్వంలో నెలకొన్న రచ్చ తెలిసిందే. రాహుల్ వర్సెస్ అసంతృప్త సీనియర్లుగా నడుస్తున్న మాటల యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ పార్టీపై తనకున్న ఆగ్రహానని తీర్చుకునేందుకు ఇంతకు మించిన సరైన సమయం లేదనుకున్నారో ఏమో కానీ.. ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని మైనార్టీ నేతల మొత్తాన్ని గంపగుత్తగా టార్గెట్ చేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి బానిసలుగా ఇంకెంత కాలం ఉంటారంటూ సీనియర్ నేత గులాం నబీ అజాద్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేతలంతా సమయం వృధా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తమను బీజేపీ బీ జట్టు అని అజాద్ ఎప్పుడూ ఎద్దేవా చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలే అజాద్ ను బీజేపీ తొత్తు అంటున్నారని వ్యాఖ్యానించారు.

అసద్ వ్యాఖ్యల్ని చూస్తే.. కాంగ్రెస్ పార్టీలోని మైనార్టీలను టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం.. రాహుల్ గాంధీ చేసిన పరుష వ్యాఖ్యలు ఒక్క గులాం నబీ అజాద్ ను ఉద్దేశించి మాత్రమే కాదు.. సోనియాగాంధీకి లేఖ రాసిన అందరూ సీనియర్ల పైనే. కాకుంటే..అజాద్.. కపిల్ సిబాల్ మాత్రమే బయటకొచ్చి తమ గళాన్ని వినిపించారు.

ఇలాంటప్పుడు సీనియర్లు అందరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయాల్సిన అసద్.. అందుకు భిన్నంగా అజాద్ ను మాత్రమే ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కాంగ్రెస్ కు బానిసలుగా కాంగ్రెస్ మైనార్టీ నేతలే ఉన్నట్లుగా అసద్ వ్యాఖ్యలు ఉండటం చూస్తే.. కాంగ్రెస్ ను ఒక చూపు చూడాలన్న యోచనలో ఉన్నట్లు కనిపించక మానదు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించి కావని అజాద్ అన్న తర్వాత కూడా అసద్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
Tags:    

Similar News