కందుకూరులో హైడ్రామా.. ఇంటూరి సోదరుల అరెస్టు వేళ.. కోర్టులో ఏం జరిగింది?

Update: 2023-01-06 07:38 GMT
కందుకూరు తొక్కిసలాట ఉదంతం రాజకీయ రచ్చగా మారటం.. దీనికి కారణమైన ఇంటూరు సోదరుల (ఇంటూరు నాగేశ్వరరావు, రాజేష్)ను హైదరాబాద్ లో అరెస్టు చేయటం తెలిసిందే. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వారిని  గరువారం అర్థరాత్రి దాటిన తర్వాత తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం అర్థరాత్రి మొదలైన హైడ్రామా ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజాము వరకు సాగింది.  చివరకు స్థానిక న్యాయమూర్తి వద్దకు వీరిని తీసుకెళ్లటం.. పెద్ద ఎత్తున జరిగిన వాదనల నేపథ్యంలో జడ్జి బెయిల్ మంజూరు చేయటంతో విషయం ఒక కొలిక్కి వచ్చినట్లైంది. అసలేం జరిగిందంటే..

టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత ఇటీవల కందుకూరులో రోడ్ షో ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున చోటు చేసుకున్న తొక్కిసలాట జరగటం.. ఆ సందర్భంగా మురుగుకాలువలో పడిపోయిన వారిలో ఎనిమిది మంది మరణించిన ఘోర దర్ఘటన గురించి తెలిసిందే. పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాటలో మరణించిన వారికి రూ.25 లక్షల చొప్పున సాయం ఇవ్వటం తెలిసిందే. ఈ దుర్ఘటనకు కారణం ఈ రోడ్ షోను నిర్వహించిన ఇంటూరి సోదరుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

వీరి కోసం పోలీసులు వెతకటం.. చివరకు హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించిన కందుకూరు పోలీసులు రెండు జీపుల్లో వెళ్లి వారిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. హైదరాబాద్ నుంచి వారిని కందుకూరుకు తీసకొచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 1. 45 గంటల సమయానికి కందుకూరు పట్టణ పోలీసు స్టేషన్ కు ఇంటూరి సోదరులను తీసుకొచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తలు చేరుకున్నారు. ఇంటూరు సోదరుల్ని స్టేషన్ లోపలకు తీసుకెళ్లే సందర్భంలో టీడీపీ నేతలు కూడా వెళ్లేందుకు ప్రయత్నించటం.. వారిని అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

దాదాపు అర్థరాత్రి 2.30 గంటల వేళలో టీడీపీ అధిష్ఠానం పంపిన హైకోర్టు న్యాయవాదులు క్రిష్ణారెడ్డి.. కిషోర్.. నరేంద్రబాబు.. పాండురంగారావులతో పాటు మరికొందరు కందుకూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. చర్చల అనంతరం వారిని స్టేషన్ లోపలకు అనుమతించారు. అనంతరం ఇంటూరు సోదరుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి..ఆ పై న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చారు.

తెల్లవారుజామున మొదలైన వాదనలు ఉదయం ఐదు గంటల వరకు సాగాయి. న్యాయమూర్తి ఇంటి బయట పెద్ద ఎత్తున టీడీపీ నేతలు.. కార్యకర్తలు చేరుకున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఇంటూరు సోదరులకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో టీడీపీ వర్గాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. మొత్తంగా గురువారం ఉదయం మొదలైన ఉత్కంట.. అర్థరాత్రి దాటిన తర్వాత ఉద్రిక్త రూపం దాల్చి.. అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తాజాగా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో పోలీసుల రియాక్షన్ ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News